తప్పిన హిండెన్‌బర్గ్‌ అంచనా

The failed Hindenburg prediction– అదానీ టోటల్‌ గ్యాస్‌లోనే షేర్ల ధరలు భారీగా పతనం
న్యూఢిల్లీ : అదానీ గ్రూపులో జరిగిన అక్రమాలు, అవకతవకలపై హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్‌ సంస్థ నివేదికను బయటపెట్టి తొమ్మిది నెలలు గడిచాయి. తన నివేదిక బహిర్గతమైన తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు 85% తగ్గుతా యని హిండెన్‌బర్గ్‌ అంచనా వేసింది. అదానీ గ్రూపునకు చెందిన ఏడు కీలక లిస్టెడ్‌ కంపెనీలలో వాటాల విలువ పతనమవుతుందని హిండెన్‌బర్గ్‌ అంచ నా వేయగా ఒకే ఒక కంపెనీ ‘అదానీ టోటల్‌ గ్యాస్‌’లో మాత్రమే ఆ సంస్థ అంచనాలు నిజమయ్యాయి. మరో రెండు కంపెనీలు… అదానీ పవర్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌లో వాటాల విలువ తగ్గకపోగా పెరిగింది. జనవరిలో హిండెన్‌బర్గ్‌ నివేదిక బయటపడే సమయానికి ఈ రెండు కంపెనీల వాటాల విలువతో పోలిస్తే ప్రస్తుతం వాటి విలువ పెరిగింది.
అదానీ గ్రూపు కార్పొరేట్‌ అవకతవ కలకు పాల్పడిందని, షేర్ల ధరలను ఎక్కువ చేసి చూపిందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించిన విషయం తెలిసిందే. తన నివేదికను బయటపెట్టిన తర్వాత అదానీ గ్రూపునకు చెందిన అదానీ పవర్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌ (ప్రస్తుతం అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌), అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ విల్మర్‌, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ కంపెనీల వాటాల విలువ పతనమవు తుందని ఆ సంస్థ అంచనా వేసింది. అయితే బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (బీఎస్‌ఈ) లో రోజువారీ స్టాక్‌ వ్యాపారానికి సంబం ధించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఒక్క అదానీ టోటల్‌ గ్యాస్‌ కంపెనీలోనే షేర్ల ధరలు 85% తగ్గాయని తేలింది. గత సంవత్సరం రెండో త్రైమాసిక కాలంతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌తో అంతమైన రెండో త్రైమాసిక కాలంలో అదానీ టోటల్‌ గ్యాస్‌ నికర లాభం కేవలం ఏడు శాతం మాత్రమే పెరిగింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ ఎనర్జీ సొల్యూ షన్స్‌ వాటాల విలువ 73.3%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ వాటాల విలువ 54%, అదానీ విల్మర్‌ వాటాల విలువ 43%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ వాటాల విలువ 33% తగ్గింది. అయితే హిండెన్‌బర్గ్‌ అంచనా వేసినట్లు 85% తగ్గలేదు. అదే సమయంలో అదానీ పవర్‌ వాటాల విలువ 15%, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ వాటాల విలువ 1% పెరిగింది.

Spread the love