ధరణితోనే రైతుకు భూమిపై సర్వహక్కులు

The farmer has all the rights on the land with Dharani– దేశానికే దిక్సూచిలా తెలంగాణ
– ఈ నేల పూల పొదరిల్లు కావాలి
– వలసల జిల్లా నుండి ప్రాజెక్టుల ఖిల్లాగా.. పాలమూరు
– పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేసే బాధ్యత నాదే
– ఫ్లోరైడ్‌ను పట్టించుకోనోడు.. నన్ను ఛాలెంజ్‌ చేస్తున్నాడు
– ధన బేహార్‌ గార్లకు తగిన బుద్ధి చెప్పాలి
– ఆగమై కాదు.. ఆలోచించి ఓటేయాలి
– వనపర్తి, అచ్చంపేట, మునుగోడు
– ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌
నవ తెలంగాణ- మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి/సంస్థాన్‌నారాయణపురం
దేశంలో ఎక్కడా లేని విధంగా లోప భూయిష్టమైన రెవెన్యూ వ్యవస్థను ధరణితో ప్రక్షాళన చేశామని, దాంతో భూమిపై రైతులకు సర్వహక్కులు వచ్చాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ప్రాజెక్టులు కట్టడంతో సాగు భూములు పచ్చబడి తెలంగాణ ఆహార ధాన్యాల భాండాగారంగా వర్ధిల్లుతుందని తెలిపారు. తెలంగాణ కోసం తాను పోరాడుతున్నప్పుడు ఈ నేతలంతా ఎవరి కాళ్ల దగ్గర ఉన్నారో తెలియదని విమర్శించారు. 24 ఏండ్ల్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు అందుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పదేండ్ల ప్రస్థానంలో అభివృద్ధి ఎల్లలు దాటిందని, పదేండ్ల కిందట తెలంగాణ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గుర్తుచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కోసం తన వంత పోరాటం అయిపోయిందని, ఇక చేయాల్సింది ప్రజలేనని, ప్రజలే తమ అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో, నల్లగొండ జిల్లా మునుగోడులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు.
పాలమూరులో ఒకప్పుడు అంబలి, గంజి కేంద్రాలు, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, కరువు, వలసలు సర్వసాధారణంగా ఉండేవని, అప్పుడు ఎవరైనా వచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉచిత విద్యుత్తు, సాగునీరు, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రజలను ఆదుకుంటున్నాయని తెలిపారు. సాగునీరు వచ్చిన తర్వాత ప్రాజెక్టుల కింద పచ్చదనంతో పంటలు పండుతున్నాయన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల ప్రచారాల్లో.. ఇప్పుడున్న సంక్షేమ పథకాల కంటే అధికంగా అమలు చేస్తామని చెప్పాల్సింది పోయి.. ఉన్న సంక్షేమాలకే కోతలు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. రైతుబంధు, దళిత బంధు, ఉచిత విద్యుత్‌ వంటి రైతు సంక్షేమ పథకాలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేవని గుర్తు చేశారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా చారగొండలో ప్రయోగాత్మకంగా దళిత బంధును అమలు చేశామని గుర్తుచేశారు. ఎకో టూరిజం ద్వారా నల్లమల ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, సుందర ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నాయకులు అభివృద్ధిపై సవాల్‌ విసరాలి కానీ దురదృష్టకరంగా కొడంగల్‌లో వచ్చి పోటీ చెరు లేదా గజ్వేల్‌కు వస్తానంటూ సవాల్‌ విసరడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకులు కాదు గెలవాల్సింది ప్రజలని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేయడం ద్వారా డిండి లింకు రిజర్వాయర్‌ పూర్తిచేసుకుని అచ్చంపేట సస్యశ్యామలం అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.
తిండి గింజలను దిగుమతి చేసుకునే దశ నుంచి ఇప్పుడు నాలుగు కోట్ల టన్నుల వడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. ఇంటింటికి తాగునీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమన్న దమ్మున్న పార్టీ బీఆర్‌ఎస్‌ అని గుర్తు చేశారు. రైతుబంధు ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తిచేసే బాధ్యత నాదే
మునుగోడు నియోజకవర్గానికి సాగునీరు తెచ్చేందుకు ప్రారంభించిన పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తిచేసే బాధ్యత నాదే అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేసి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆగమాగమై ఓట్లు వేయొద్దు.. ఆలోచించి వేయాలని సూచించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే వెనుకటి రోజులు వస్తాయన్నారు. ధన మదంతో కొంతమంది నాకే సవాల్‌ చేస్తున్నారన్నారు. ధన బేెహర్‌ గాళ్లను ఓడించాలన్నారు. పూటకో పార్టీ మార్చి మోసపు మాటలతో మోసగిస్తారని చెప్పారు. పోరాటాల చరిత్ర కలిగిన నల్లగొండ జిల్లా ప్రజలు మోసపోకుండా పనిచేసే వాళ్లనే గెలిపించాలని కోరారు. ఉప ఎన్నికల సందర్భంగా మునుగోడులో తాను ఇచ్చిన హామీల్లో 90శాతం పూర్తి చేశామని చెప్పారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మునుగోడులో ఫ్లోరైడ్‌ భూతాన్ని నివారించలేకపోయిందని విమర్శించారు. ”ఫ్లోరైడ్‌తో ప్రజల నడుములు వంగిపోయిన నాడు పట్టించుకోనోడు.. ఈ రోజు నన్ను ఛాలెంజ్‌ చేస్తున్నాడు.. రాజకీయాల్లో పనికిమాలిన వాళ్లు.. డబ్బు మదంతో ఎవరైతే పని చేసేవారుంటారో.. అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పి ప్రజలు గెలవాలి” అని అన్నారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఆయా సభల్లో మంత్రులు నిరంజన్‌రెడ్డి, గుంతకండ్ల జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్‌, బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గువ్వల బాలరాజు, కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మెన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, కల్లుగీత కార్పొరేషన్‌ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, భువనగిరి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ ఎలిమినేటి సందీప్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.
వలసల జిల్లా ప్రాజెక్టుల ఖిల్లా
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అడిగిన కళాశాల, బైపాస్‌ రోడ్డు పనులను ఎన్నికలు పూర్తికాగానే మంజూరు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులు, బీసీలు, మైనార్టీలు రైతులకు మహర్దశ వచ్చిందన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఉచిత విద్యుత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఏనాడూ అది వృథా ఖర్చుగా భావించలేదన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణిని కాంగ్రెస్‌ వాళ్లు తొలగిస్తామనడం సిగ్గుచేటు అన్నారు. అనేక సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చిన ధరణిని తొలగిస్తామన్న కాంగ్రెస్‌ను ప్రజలే తొలగిస్తారని హెచ్చరించారు. ప్రజా వ్యతిరేకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ అభివృద్ధిని ఆపబోమన్నారు.

Spread the love