బాలల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్తు

Deputy CM Bhatti Vikramarka– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– రాష్ట్రవ్యాప్తంగా ఆట్టహాసంగా ప్రారంభమైన ప్రభుత్వ బడులు
– విద్యార్ధులకు దుస్తులు, పుస్తకాలు అందజేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు
– ‘ఫిట్‌’నెెస్‌లేని బస్సులపై కొరడా..
నవతెలంగాణ-విలేకరులు
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేసిన ఘనత తమ ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు బుధవారం పున: ప్రారంభమయ్యాయి. ఆమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మరమ్మత్తులు నిర్వహించారు. వాటిని దాదాపు పూర్తిచేసి పాఠశాలలకు కొత్త రంగులతో, తోరణాలతో ఉపాధ్యాయులు విద్యార్థులను ఆహ్వానించారు. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం కాన్పమేడిగూడ రోడ్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత, మండల పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులపై పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర మండలం ఒద్యారం జెడ్పీహెచ్‌ పాఠశాల ఆవరణను మామిడి, అరటి, కొబ్బరి తోరణాలతో అలంకరించి విద్యార్థులను ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని పాఠశాలల్లో జరిగిన బడిబాట కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్‌లు, నోటు బుక్కులు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎన్‌ఎస్‌ కెనాల్‌ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మంత్రి తమ్మల నాగేశ్వరరావుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. విద్యాభివృద్ధికి బడ్జెట్‌లో ఎన్ని నిధులైనా కేటాయిస్తామని తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలల బంగారు భవిష్యత్తుపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అన్నారు. ప్రతి విద్యార్థికి కావాల్సిన తరగతి గది, తాగునీరు, టాయిలెట్‌ రన్నింగ్‌ వాటర్‌తో సదుపాయాల కల్పన చేస్తున్నట్టు తెలిపారు. పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్‌ సరైన సమయంలో అందిస్తే, మంచి ఫలితం ఉంటుందన్న దృష్టితో పాఠశాలలు తెరిచిన రోజునే అందేలా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. విద్యపై ఎంత ఖర్చైన ప్రభుత్వం వెనకాడదని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. కొణిజర్ల హైస్కూల్‌లో విద్యార్థులకు వైరా ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌ నాయక్‌ చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలోని అన్ని మండలాల్లో విద్యార్థులకు యూనిఫామ్‌, పుస్తకాలు పంపిణీ చేశారు. పాఠశాలల ఆవరణం శుభ్రం చేయించారు. ఖమ్మం రూరల్‌ మండలం పెద్ద తండా పంచాయతీ పరిధిలోని జలగం నగర్‌ ప్రాథమిక పాఠశాలలో వర్షం నీరు నిలువకుండా మట్టి పోయించారు. ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాల నిర్మాణం, గేట్ల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌ అబిడ్స్‌లోని అలియా మోడల్‌ హైస్కూల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ.. కోడ్‌కి ముందే ప్రభుత్వం తెలంగాణలో 26,872 పాఠశాలల్లో రూ. 1100 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు, తాగునీరు, టేబుల్స్‌, మరమ్మతులు, కలర్స్‌ పనులు చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్‌ ఔట్స్‌ లేకుండా బట్టలు, మధాహ్న భోజనం, సౌకర్యాలు కల్పిస్తున్నామని, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని 16 ప్రభుత్వ స్కూల్స్‌లో ‘అమ్మ ఆదర్శ స్కూల్‌’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని తాము సంకల్పిస్తున్నామని తెలిపారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమానికి మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హాజరయ్యారు. మంత్రి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం, చదువుల తల్లి సరస్వతి దేవి, ప్రొఫెసర్‌ జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్టు తెలిపారు. సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, నంగునూరులోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌ రెడ్డి విద్యార్థులకు ఉచిత నోట్‌, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందజేశారు. ప్రజ్ఞాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ డాక్టర్‌ వంటేరు యాదవ రెడ్డి నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు. కొండపాక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్‌ మను చౌదరి హాజరై విద్యార్థులతో కలిసి కేక్‌ కట్‌ చేసి విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్‌, పాఠ్య, నోట్‌ పుస్తకాలు అందజేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హైస్కూల్‌లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా పంపిణీ చేశారు. భద్రాచలంలోని జగదీష్‌ కాలనీలో బడిబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. అన్నపురెడ్డిపల్లి బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పుస్తకాలు, యూనిఫామ్‌ పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ బడిబాట కార్యక్రమంలో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ పాల్గొని మాట్లాడారు. మండల విద్యాధికారి సర్దార్‌ నాయక్‌ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీవాడ పాఠశాలలో ఎంపీ గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల శంకర్‌ పాల్గొని పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను అందించారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రైమరీ పాఠశాల-1లో కలెక్టర్‌ రాజర్షి షా, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌ పాల్గొన్నారు. నేరడిగోండ మండలంలోని వడూర్‌ పాఠశాలలో బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో ప్రభుత్వవిప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్‌ హనుమంతు కె.జెండగే, ఎమ్మెల్యే.. విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించి, పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పాఠ్యపుస్తకాలు అందజేశారు. నల్లగొండ జిల్లాకేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ దాసరి హరిచందన విద్యార్థులకు స్కూల్‌ యూనిఫామ్‌, పాఠ్యపుస్తకాలు పంపిణీచేశారు. కేతెపల్లి, నకిరేకల్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఎమ్మెల్యే వీరేశం యూనిఫామ్స్‌ పంపిణీ చేశారు.వేములపల్లి మండలంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ పంపిణీచేశారు. సూర్యాపేట జిల్లా మునగాలలోని జిల్లా పరిషత్‌ హై స్కూల్లో జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు విద్యార్థులకు యూనిఫామ్స్‌ పంపిణీ చేశారు. తుంగతుర్తి మండలం అన్నారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే మందుల సామేల్‌ పాల్గొన్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో జిల్లా పరిషత్‌ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను, ఏకరూప దుస్తులను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పంపిణీ చేశారు. పదో తరగతిలో 10జీపీఏ సాధించిన ఎలిగేటి సవితకు ఎమ్మెల్యే రూ.5000 ప్రోత్సాహాన్ని అందజేశారు. సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్‌లో ఎమ్మెల్యే సత్యం పాల్గొని యూనిఫామ్స్‌, నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు.
సమస్యల స్వాగతం
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో బడిబాట కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. కొందరు ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. బడిబాట కార్యక్రమం ప్రారంభమై వారం రోజులు అయినా పాఠశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ముదిగొండ హైస్కూల్‌లో అసాంఘిక కార్యకలాపాలతోపాటు, మందుబాబులకు అడ్డాగా మారి బీరు, బ్రాందీ, సీసాలు పాఠశాలలో దర్శనమిస్తున్నాయి. మండల కేంద్రం నుంచి పాఠశాలలకు తరలించే పాఠ్యపుస్తకాలను ఉపాధ్యాయులు విద్యార్థుల చేత మోయిస్తున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలోని మాలపల్లి మండల పరిషత్‌ పరిషత్‌ పాఠశాల శుభ్రం చేసే వారు కరువయ్యారు. ఎక్కడి చెత్త అక్కడే దర్శనమిచ్చింది. ఇదిలా ఉండగా పాఠశాలకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రాకపోవడం గమనర్హం. దీంతో విద్యార్థులు పాఠశాల ఆవరణంలో ఆటలాడుతూ కాలక్షేపం చేశారు. అభివృద్ధిపనులు కూడా కొనసాగుతున్నాయి.
‘ఫిట్‌’లెస్‌లేని బస్సులపై కొరడా..
ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులపై స్కూల్స్‌ ప్రారంభం రోజే రవాణాశాఖ అధికారులు కొరడా ఝలింపించారు. గ్రేటర్‌లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 71 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇక హైదరాబాద్‌ నగర పరిధిలోని మొత్తం అయిదు జోన్‌లలో కలిపి మొత్తం 25 బస్సులను సీజ్‌ చేయగా.. అందులో 19 బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ లేకపోగా.. మరో ఆరు బస్సులకు పర్మిట్‌తో పాటు టాక్స్‌ చెల్లించలేదని సంబంధిత అధికారులు గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తంగా 12 వేల బస్సులు ఉండగా, వాటిలో 8 వేల బస్సులకు మాత్రమే ఫిటినెస్‌ ఉందని రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్‌ మామిండ్ల చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం చేసిన తనిఖీల్లో ఫిట్‌నేస్‌ లేకుండా ఉన్న 46 బస్సులు గుర్తించినట్టు తెలిపారు. ఆ బస్సులకు సంబంధించిన విద్యసంస్థలపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.

Spread the love