Friday, May 1, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుబస్తీల్లో పేదల కష్టాలు

బస్తీల్లో పేదల కష్టాలు

- Advertisement -

కనీస సౌకర్యాల లేమితో ఇక్కట్లు అర్ధరాత్రి తాగునీటి సరఫరా

కలుషిత నీటితో జనం రోగాలపాలు
నిత్యం రోడ్డుపై పారుతున్న మురుగునీరు
దుర్వాసన, దోమల బెడదతో ఉక్కిరిబిక్కిరి
ప్రభుత్వాల ఎన్నికల హామీలు బుట్టదాఖలు
ఇదీ సీపీఐ(ఎం) ‘బస్తీ బాట’లో వెల్లువెత్తిన జనం గోడు

నవతెలంగాణ-సిటీబ్యూరో
మెరిసిపోయే ఫ్లైఓవర్లు, 50 అంతస్తుల భవనాలు, కార్పొరేట్‌ శోభతో విరాజిల్లే గ్రేటర్‌ హైదరాబాద్‌ ముసుగులో పేదల బతుకులు ఛిద్రమవుతున్నాయి. ఒకవైపు ధనవంతుల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్న పాలకులు.. మరోవైపు బస్తీల్లో నివసించే శ్రమజీవులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఈ నేపథ్యంలో సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి 28 వరకు నిర్వహించిన ‘బస్తీ బాట’ కార్యక్రమంలో నగరంలోని పేదలు వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను తెలియజేశారు. ఈ మేరకు గురువారం ఆ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్‌, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మహేందర్‌, కమిటీ సభ్యులు ఆర్‌.వెంకటేష్‌తో కలిసి ముషీరాబాద్‌ గోల్కొండ చౌరస్తాలోని నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

లిఫ్టులు లేని ఇండ్లు.. అర్ధరాత్రి నీళ్లు!
”బాగ్‌లింగంపల్లి డివిజన్‌లోని లంబాడీ తండాలో ప్రభుత్వం నిర్మించిన జీ-ప్లస్‌-9 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లల్లో పేదల కష్టాలు వర్ణనాతీతం. ఇక్కడ రెండు లిఫ్టులు ఉన్నా పని చేయకపోవడంతో 117 ఫ్లాట్లలోని ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగేనీటిని సైతం పైఅంతస్తులకు మోసుకెళ్లాల్సిన దుస్థితి. వీటికితోడు కమర్షియల్‌ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడంతో బిల్లు నెలకు రూ.50వేల వరకు వస్తోందని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. భగత్‌సింగ్‌ నగర్‌ బస్తీలో నివసిస్తున్న 71 కుటుంబాలు డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నా కట్టి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కవాడీగూడ డివిజన్‌లోని బీమామైదాన్‌ బస్తీలో తాగునీటి సరఫరా తీవ్ర ఇబ్బందిగా మారింది. అర్ధరాత్రి 12గంటల నుంచి 1 గంట మధ్య నీటిని వదులుతున్నారు.

అవి కూడా మురికిగా వస్తుండటంతో తాగిన జనం రోగాల బారిన పడుతున్నారు. పద్మనాభనగర్‌ డివిజన్‌ భోజగుట్ట, శివాజీనగర్‌ బస్తీలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ప్రజలు కోరారు. బుడగ జంగం బస్తీలో 200 కుటుంబాలుండగా రెండు నల్లాలు మాత్రమే ఉన్నాయి. దీంతో పబ్లిక్‌ నల్లాలు పెంచాలని, తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరారు. డ్రయినేజీ పైపులైన్‌ లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. నాలా గండం..మూసీ ముప్పు!కార్మికనగర్‌ డివిజన్‌లో డ్రయినేజీ నీరు నిత్యం రోడ్డు మీద పారుతోంది. అర్ధరాత్రి 12గంటలకు తాగునీరు వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. బోరబండ డైలీ లేబర్‌ బస్తీలో నాలాకు పైకప్పు లేకపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాచిగూడ డివిజన్‌లోని తులసిరామ్‌ నగర్‌, లంక, కృష్ణనగర్‌ బస్తీవాసులను మూసీ సుందరీకరణ’ భయం వెంటాడుతోంది. బఫర్‌జోన్‌ పేరుతో ఇండ్లను తొలగిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని, కష్టాన్ని నమ్ముకుని కట్టుకున్న ఇండ్లను కూల్చొద్దని వేడుకుంటున్నారు. భోజగుట్ట, శివాజీ నగర్‌ బస్తీల్లో వందలాది కుటుంబాలకు నేటికీ ఇండ్ల పట్టాలు లేవు.

అర్హులకు అందని గ్యారంటీలు.. పెరిగిన ధరలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని సీపీఐ(ఎం) నేతలు విమర్శించారు. ”గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన బీజేపీ, ఇప్పుడు రూ. 1100 దాటించి సబ్సిడీని పూర్తిగా ఎత్తేసింది.. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ‘ఆరు గ్యారంటీలు’ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. రూ.500 గ్యాస్‌ సిలిండర్‌, ఉచిత విద్యుత్‌, పెంచిన పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు.. ఇలా ఏ ఒక్కటీ అర్హులైన పేదలందరికీ అందడం లేదని చెబుతున్నారు” అని వివరించారు.

పోరుబాట తప్పదు..
బస్తీ బాటలో వెలుగులోకి వచ్చిన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీపీఐ(ఎం) డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో వచ్చే వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించింది. ఈ బస్తీ బాటను పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి ప్రారంభించారు. సీపీఐ(ఎం) గ్రేటర్‌ హైదరాబాద్‌ సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.వెంకటేష్‌, కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు నాయకత్వం వహించారు. కార్యదర్శివర్గ సభ్యులు కెఎన్‌. రాజన్న, ఎం.మహేందర్‌, ఎం.దశరథ్‌, కె.నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -