ఫేస్ బుక్ పై హైకోర్టు సీరియస్..దేశంలో నిషేధిస్తామని హెచ్చరిక!

నవతెలంగాణ – కర్ణాటక
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థకు కర్ణాటక హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. భారత్లో ఎఫ్ బీ సేవలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని వార్నింగ్ ఇచ్చింది. కోర్టు సూచనలనూ పరిగణలోకి తీసుకోకపోవడంతోనే ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంతకూ ఏం జరిగిందంటే.. ఫేస్ బుక్ లో సౌదీ రాజుపై అభ్యంతరకర పోస్టు పెట్టాడంటూ శైలేష్ కుమార్ అనే భారతీయుడిని 2019లో అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో శైలేష్ ను జైలుకు పంపించారు. అయితే, తన పేరుతో నకిలీ ఖాతాను సృష్టించిన దుండగులు ఈ పని చేశారంటూ శైలేష్ చెప్పారు. దీనిపై ఎంతగా ప్రాధేయపడ్డా సౌదీ న్యాయస్థానం పరిగణలోకి తీసుకోలేదు. సౌదీ రాజుపై, ఇస్లాం మతంపై అభ్యంతరకర పోస్టు పెట్టిన నేరానికి జైలు శిక్ష విధించింది. ఈ విషయం తెలిసి శైలేష్ భార్య కవిత మంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శైలేష్ కుమార్ పేరుతో నకిలీ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఫేస్ బుక్ కు లేఖ రాశారు. కానీ ఫేస్‌బుక్ స్పందించలేదు. విచారణ ఆలస్యం కావడంతో 2021లో కవిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. జైలు నుంచి తన భర్తను విడిపించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది.
దీనిపై తాజాగా కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టింది. తప్పుడు కేసులో శైలేష్ శిక్ష అనుభవిస్తున్నాడని, అతడిని విడిపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణ పూర్తిచేసి నివేదిక సమర్పించాలని మంగళూరు పోలీసులకు, నకిలీ ఖాతాకు సంబంధించి పూర్తి సమాచారం కోర్టుకు అందించాలని ఫేస్ బుక్ సంస్థను హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లోగా పూర్తి వివరాలు అందించకుంటే భారత్ లో ఫేస్ బుక్ సేవలను నిలిపేసే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. కర్ణాటకకు చెందిన శైలేష్ కుమార్ పాతికేళ్లుగా సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. శైలేష్ భార్య కవిత, పిల్లలు మంగళూరు సమీపంలో వుంటారు. 2019లో కేంద్ర ప్రభుత్వం సీఏఏ, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. శైలేష్ ఈ చట్టాలకు మద్దతిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు అతని పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను తెరిచారు. అందులో సౌది అరేబియా రాజు, ఇస్లాం మతానికి వ్యతిరేకంగా అభ్యంతకర పోస్టులు చేశారు.

Spread the love