ఆలోచన

ఆలోచనఆలోచన కన్నా దృఢమైన వస్తువు ఈ సృష్టిలో లేదని అంటారు పెద్దలు. మనిషి మానసిక శక్తిలో ఆలోచనా శక్తికి అంతటి విలువైన స్థానం ఉంది. ఈ శక్తి మనిషిలో కొత్త చైతన్యాన్ని ప్రవహింపజేస్తుంది. ఆలోచన మనిషికి ప్రాణం. మనం ఎంత ఆలోచిస్తే మన మెదడు అంతగా పని చేస్తుంది. అయితే మన ఆలోచనల ప్రతిరూపమే మనం. మనలోని బలమైన ఆలోచనలకు మన జీవితమే అద్దం. ఆలోచన వల్లనే మనిషి వ్యక్తిత్వం వికసిస్తుంది. ఆలోచన మనిషిని ఉన్నతంగా తయారు చేస్తుంది. ఆలోచనల వల్ల నిరాశతో నిండిన మనసులో ఆశ చిగురిస్తుంది. మనకు విచక్షణా జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచనలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఉద్దేశపూర్వకంగా మనసుతో ఆలోచించి జీవితాన్ని తీర్చిదిద్దుకోగల స్వేచ్ఛ మనకు ఉంది. ఆలోచనలు లేని మనిషంటూ ఉండడు.
అయితే ఆలోచన అంటే ఏమిటి? ప్రతి మనిషికి రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మన ఆలోచనలు అనుకూలంగా, ప్రతికూలంగా కూడా ఉంటాయి. అవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మన మానసిక స్థితి ద్వారానే పరిస్థితులు ఏర్పడతాయి. మనుషులే కాదు పశువులు, వృక్షాల్లాంటి చైతన్యం ఉన్న ప్రాణులపైన కూడా ఆలోచనల ప్రభావం ఉంటుందని సైన్స్‌ రుజువు చేసింది. మనుషుల్లో కలిగే లోతైన ఆలోచనలతో సమాజంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. ఆలోచనలలో ప్రేమ, సత్యం, దృఢత్వం ఉంటే ఆశించిన ఫలితం లభిస్తుంది. ప్రకాశవంతమైన ఆలోచనల ద్వారానే మనిషికి గుర్తింపు ఏర్పడుతుంది. అవే మనిషిని గొప్పగా తీర్చిదిద్దుతాయి. మంచి ఆలోచనలు ఉంటేనే జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. మన మనసులోంచి వచ్చిన ఒక మంచి ఆలోచనకు మన జీవితాన్ని సరిదిద్దగలిగే శక్తి ఉంటుంది. ఏదైనా లక్ష్యం సాధించాలని ప్రయత్నించే వారి ఆలోచనలలో శక్తి లేకపోతే వైఫల్యం ఎదురవుతుంది.
చైతన్యవంతమైన ఆలోచనలు చేసే ఆశావాదిలో విలక్షణమైన శక్తి దాగి ఉంటుంది. మనకు ఏదైనా మంచి జరుగుతుందని ఆలోచన చేస్తే.. ఆ ఆశతో నిండిన ఆలోచనలు మన ప్రగతికి దోహదం చేస్తాయి. అయితే ఆలోచనా దారిద్య్రం ఉన్నవారు, దీనత్వానికి వశమయ్యేవారు మాత్రం ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండలేరు. ఇలాంటి వారు కోట్లు సంపాదించినా మానసిక దరిద్రులుగా ఉంటారు. ధన దారిద్య్రం కన్నా మానసిక దారిద్య్రం అత్యంత దారుణమైనది. ఎప్పుడూ భయం, అనుమానంతో పీడితులయ్యే వారు ఆరోగ్యమైన జీవితంలోని ఆనందాన్ని ఎన్నటికీ పొందలేరు. కొందరు వ్యక్తులు ఆరోగ్యంగానే ఉంటారు. కానీ మనసులో తమను తాము రోగులుగా భావించుకుంటూ ఉంటారు. అలా కాకుండా తాము కోలుకుంటున్నామనీ, ఆరోగ్యం మెరుగుపడుతోందనీ ఆలోచన చేస్తే త్వరగా రోగ విముక్తలవుతారు. కాబట్టి శుభప్రదమైన ఆలోచనలను మాత్రమే చేయాలి.
మనకు అక్కర లేని అంశాలు, భయం కలిగించే విషయాల మీద, బాధ కలిగించే వాటిపైన ఆలోచనలను కేంద్రీకరించడం మాని, కావాల్సిన వాటిపై దృష్టి పెడితేనే మన జీవితం మారుతుంది. అందుకే ఆలోచనలపై జీవితం ఆధారపడి ఉంది. ఎక్కువ కాలం వ్యతిరేక ఆలోచనలు చేస్తుంటే మనసు మరింతగా ఆందోళనకు గురవుతుంది. మంచి ఆలోచనలు చేస్తే అవి ఎక్కువ శక్తినిస్తాయి. ‘నా ఆలోచనలపై నాదే అధికారం’ అని మనం తరుచూ అనుకోవాలి. మన ఆలోచనల మంచి చెడులకు పూర్తి బాధ్యులం మనమేనని నిత్యం భావించాలి. అసలు ముందుగా మనం ఏం చేయాలో, ఏం కావాలో నిశ్చయించుకోవాలి. దాని ప్రకారమే పని చేయాలి. అప్పుడు ఆలోచనలే మన జీవితంగా రూపుదాలుస్తాయి.

Spread the love