Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కమిటీలకు ప్రాధాన్యత

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కమిటీలకు ప్రాధాన్యత

- Advertisement -

కౌన్సిల్‌ చైర్మెన్‌ 
గుత్తా సుఖేందర్‌‌రెడ్డి
నేనూ కమిటీ చైర్మెన్‌‌గా పనిచేశా: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌‌కుమార్‌
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ కమిటీలకు ‌చాలా ప్రాధాన్యత ఉంటుందని శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీలోప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా చూడడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో సోమవారం జరిగిన శాసనమండలి (లెజిస్లేచర్) మైనారిటీల సంక్షేమ కమిటీ, షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈసందర్భంగా చైర్మెన్‌ ‌మాట్లాడుతూ
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కమిటీలు నిత్యం పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలని అన్నారు. మైనారిటీల విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి వారికి ప్రభుత్వ పథకాలు, నిజమైన ప్రయోజనాలను అందించేలా చూడాల్సిన బాధ్యత ఈ కమిటీపై ఉన్నదని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పర్యటనలతో పాటుగా, అధికారుల ద్వారా సమాచారాన్ని తెప్పించుకోవాలని సూచించారు. షెడ్యూల్ కులాలకు సంబంధించిన పథకాల అమలులో లోటుపాట్లను సమీక్షించి ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు అనుగుణంగా ఖర్చుపై సమగ్రంగా వివరణలను తీసుకోవాలని చెప్పారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ నేను కూడా 2008 లో షెడ్యూల్ కులాల కమిటీ చైర్మెన్‌గా బాధ్యతలు నిర్వహించానని గుర్తుచేశారు. తెలంగాణ ఎప్పటి నుంచో “గంగా- జమున తెహజీబ్”కు ఒక గొప్ప ప్రతీకగా నిలుస్తుందన్నారు. హిందువులు, ముస్లిములు, క్రిష్టియన్లు ఇతర మైనారిటీ సోదరులు తరతరాలుగా ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి జీవిస్తున్నారన్నారు. పండుగలు, భాషలు, ఆహారం, సంస్కృతులను పంచుకుంటూ, అన్నింటికంటే ముఖ్యంగా ప్రేమ, విశ్వాసాలతో ముందుకు సాగుతున్నారని వివరించారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం మేర షెడ్యూల్ కులాలు ఉన్నారని చెప్పారు. ఈ కమిటీ షెడ్యూల్ కులాల అభ్యున్నతి, సంక్షేమం కొరకు పనిచేస్తూ వారి ప్రాధమిక అవసరాలను గుర్తించి, అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని వివరించారు. కమిటీ సభ్యులు తమ అనుభవం, అవగాహనతో అధికారులతో కలిసికట్టుగా పనిచేసి ప్రజాప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించడానికి, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని వివరించారు. ఈ సమావేశానికి లెజిస్లేచర్ మైనారిటీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మెన్‌ తోట లక్ష్మీకాంతా రావు , సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, పాయల్ శంకర్ హాజరయ్యారు. అలాగే శాసనమండలి ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మెన్‌ మేడిపల్లి సత్యం , సభ్యులు వెడ్మ బొజ్జు, కేఆర్ నాగరాజు, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయుడు, శ్రీపాల్ రెడ్డి, బస్వరాజు సారయ్యతోపాటు శాసన పరిషత్ కార్యదర్శి డా. వి నరసింహా చార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతి తదితరులు హాజరయ్యారు. ముందుగా నూతన కమిటీ చైర్మెన్లు, సభ్యులకు పుష్ప గుచ్ఛాలతో చైర్మెన్‌, స్పీకర్‌ అభినందనలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -