Monday, April 20, 2026
E-PAPER
HomeNewsసామ్రాజ్యవాదానికి భారతరైతాంగం బలి

సామ్రాజ్యవాదానికి భారతరైతాంగం బలి

- Advertisement -
  • ట్రంప్‌ రాక్షసచర్యలను ఖండించ లేని మోడీ
  • ప్రతీ గంటకు ముగ్గురు రైతులు చనిపోతున్నా చలనం లేదు
  • భారతీయ వ్యవసాయంపై ఇరాన్‌- ఇజ్రాయిల్‌ యుద్ధ ప్రభావం
  • రైతాంగ పోరాటాల ఫలితమే దున్నేవానికి భూమి
  • 23న కొత్తగూడెంలో ఏఐకేఎస్‌ రైతుసంఘం రాష్ట్ర మహాసభలు
  • తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు
    నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి: సామ్రాజ్యవాదానికి భారత రైతాంగం బలవుతోందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ రాక్షస చర్యలను ఖండించటంలో మోడీ విఫలమవుతున్నారని తెలంగాణ రైతుసంఘం (ఏఐకేఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఇరాన్‌- ఇజ్రాయిల్‌ యుద్ధ ప్రభావం భారత వ్యవసాయంపై తీవ్రంగా ఉందన్నారు. పెట్రో, గ్యాస్‌ ఆధారిత ఉత్పత్తుల ధరలు అమాంతం పెరిగాయన్నారు. 23వ తేదీ నుంచి మూడు రోజులు కొత్తగూడెంలో నిర్వహించే ఏఐకేఎస్‌ తెలంగాణ రైతుసంఘం మూడో రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తల్లాడ మండల కేంద్రంలోని సామినేని రామారావు నగర్‌, కాసాని ఐలయ్య ప్రాంగణం (వాసవి కళ్యాణ మండపం)లో సోమవారం నిర్వహించిన సంఘం ఖమ్మం జిల్లా తృతీయ మహాసభలో పోతినేని ప్రారంభ ఉపన్యాసం చేశారు. రైతాంగ పోరాటాల ఫలితమే దున్నేవానికి భూమని తెలిపారు. దున్నేవానికి భూమి, వెట్టిచాకిరీ రద్దు కోసం పోరాటాలు నిర్వహించింది రైతుసంఘాలేనని తెలిపారు. మళ్లీ దేశంలో తిరోగమన పరిస్థితులు దాపురించాయన్నారు. ట్రంప్‌ సామ్రాజ్యవాద ఆధిపత్యధోరణి భారతీయ వ్యవసాయాన్ని దెబ్బతీస్తోందన్నారు. కేంద్రం రైతుసంఘాలతో కుదిరిన ఒప్పందాలను పక్కనపెట్టి అమెరికాతో నామమాత్రంగా చేసుకున్న ఒప్పందాలను అమలు చేస్తోందన్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ గంటకు ముగ్గురు రైతులు చనిపోతున్నా మోడీకి చలనం లేదన్నారు. పత్తి కనీస మద్దతు ధర క్వింటా రూ.8,110 ఉంటే ఈ ఏడాది మొత్తమ్మీద ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రూ.6,700 మాత్రమే అధిక రేటుగా నమోదైందన్నారు. ట్రంప్‌ రాక్షస చర్యలను ఖండించటంలో మోడీ విఫలమవుతున్నారని అన్నారు. భారత రైతాంగాన్ని తమ పని తాము చేసుకోనివ్వట్లేదని చెప్పారు.
  • భారత వ్యవసాయరంగంపై అమెరికా ఆధిపత్యం

అమెరికాకు మన సరుకు పంపితే 50% పన్నువేస్తున్నారని, అదే అమెరికా మన దేశానికి పంపితే మాత్రం ఎటువంటి పన్ను లేకుండా విక్రయాలు చేసుకోవచ్చని అన్నారు. మన పత్తి దిగుబడులు వచ్చే సమయానికి విదేశాల నుంచి ఆ పంట దిగుబడులు మనదేశానికి వస్తున్నాయని తెలిపారు. మన పత్తి 26 స్టేబుల్‌ అని, విదేశీ పత్తి 36 స్టేబుల్‌ అనే పేరుతో రూ.9వేలకు విదేశీ పత్తిని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. భారత రైతాంగం సామ్రాజ్యవాదానికి ఎరగా మారిందని వాపోయారు. మోడీ పాలనలో అదాని ముందుకు పోతుంటే దేశం వెనక్కుపోతోందన్నారు.

నూతన విత్తన చట్టం విదేశీ విత్తనాలకు అనుకూలంగా ఉందన్నారు. కొర్రీలు లేకుండా మొక్కజొన్న కొనుగోళ్లు చేయాలన్నారు. ఎకరానికి 26 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధన ఎత్తివేయాలన్నారు. ఎంత దిగుబడినైనా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టేదారు సంతకం ఉంటేనే కొనుగోలు చేస్తామనే నిబంధన కూడా సరికాదన్నారు. కొందరు పట్టేదారులు విదేశాల్లో ఉంటున్నారని తెలిపారు. భారత వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలను ఖండించాలని, రైతాంగం, ప్రజాపోరాటాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.

23వతేదీ నుంచి మూడురోజుల పాటు కొత్తగూడెం పట్టణంలో నిర్వహించే సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాల్సిందిగా పోతినేని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతుసంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టారు. మూడేళ్లలో రైతుసంఘం నిర్వహించిన ఉద్యమాల గురించి వివరించారు. మహాసభ ప్రారంభానికి ముందు ఏఐకేఎస్‌ జెండాను రైతుసంఘం సీనియర్‌ నాయకులు తాతా భాస్కర్‌రావు ఆవిష్కరించారు. దుగ్గి కృష్ణ, శీలం ఫకీరమ్మ, దొండపాటి నాగేశ్వరరావు, గుడవర్తి నాగేశ్వరరావు అధ్యక్షవర్గంగా సాగిన ఈ సభలో మచ్చా నర్సింహారావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో సీనియర్‌ నాయకులు రాయల నాగేశ్వరరావు, శీలం సత్యనారాయణరెడ్డి, కళ్యాణం కృష్ణయ్య, నల్లమోతు కృష్ణయ్య, భూక్యా వీరభద్రం, బండి రమేశ్‌, పొన్నం వెంకటేశ్వర్లు, మాచర్ల భారతి, ఐనాల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 250 మంది ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు. పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. కార్యదర్శి నివేదికపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -