– టీఎస్‌యూటీఎఫ్
నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కెజిబివి పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వాటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కెజిబివి పాఠశాలల్లో ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండాల్సి ఉండగా, అధికారుల, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో పరిమితికి మించి విద్యార్థులను చేర్చుకోవడం వల్ల ఉపాధ్యాయులపై తీవ్ర బోధనా భారం పడుతోందన్నారు. ప్రతి తరగతికి ముఖహాజరు నమోదు చేయడం, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలను నిర్వహించడం వంటి అదనపు బాధ్యతలు కూడా పెరిగాయని పేర్కొన్నారు.
విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని, హాస్టళ్లలో విద్యార్థులకు సరిపడా వసతులు కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయులతో రాత్రి డ్యూటీలు చేయించడం వల్ల వారు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కేర్‌టేకర్లను నియమించి పని భారం తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. కెజిబివి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా పోరాట కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు మీసాల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, నాయకులు రాములు, ఈ. రజిత, అంజలి, సైదా తదితరులు పాల్గొన్నారు.


