తల్లి కూతుర్ని రూమ్ లో బంధించి అడ్డు గోడ కట్టేశారు

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్తి తగాదా నేపథ్యంలో ఓ మహిళ, ఆమె టీనేజ్ కుమార్తెను ఒక గదిలో ఉంచి, బయటకు రాకుండా వారి బంధువులు అడ్డుగోడ కట్టిన షాకింగ్ ఘటన పాకిస్థాన్‌లో వెలుగుచూసింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి తల్లికూతురిని రక్షించారు. ఇరుగుపొరుగువారి సాయం తీసుకున్న పోలీసులు చాలా వేగంగా గోడను బద్దలు కొట్టారు. దీంతో తల్లీకూతురు ప్రాణాలతో బయటపడ్డారు. సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సుహైల్ అనే తన బావమరిది, అతడి కుమారులతో కలిసి తాము బయటకు రాకుండా ఒక గదిలో బంధించి గోడ నిర్మించారని బాధిత మహిళ తెలిపింది. ఆస్తి తగాదా నేపథ్యంలో సుహైల్‌ను నిత్యం వేధిస్తున్నాడని ఆమె చెప్పారు. ఇంటికి సంబంధించిన కీలకమైన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నాడని ఆమె పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. బాధ్యులను కచ్చితంగా పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్థానిక సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఫరూఖ్ లిన్జార్ ప్రకటించారు.

Spread the love