భమిడి కమలాదేవి… వయసు ఎనిమిది పదులు దాటినా ఆమె స్వరం అలసిపోలేదు. సంగీతం పట్ల ఉన్న అద్భుతమైన ప్రేమతో పాడుతూనే ఉన్నారు. అంతేనా సంగీతాన్ని మరింత విస్తరింప చేయాలనే తపనతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికీ సంగీతం టీచర్‌గా పని చేస్తూ ఎంతో మందిని గురువులుగా తయారు చేస్తున్నారు. విభిన్నమైన రచనలు చేస్తూ, కథలు, నవలలు రాస్తూ పుస్తకాలు ముద్రిస్తున్నారు. అనేక పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. అన్నింటికీ మించి సంగీతాన్ని విశ్వవ్యాపితం చేస్తున్న ఆమె పరిచయం ఆమె మాటల్లోనే…
దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే మద్రాసు మహానగరంలో పుట్టాను. నాన్న కోరాడ రామకృష్ణయ్య, అమ్మ అన్నపూర్ణమ్మ. నాన్న మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉండేవారు. దాంతో చిన్నతనం నుండే నేను సమకాలీన సాహిత్యం ఎక్కువగా చదవడం వల్ల భాషపై పట్టు వచ్చింది. అలాగే చిన్నతనం నుండి శాస్త్రీయ సంగీతం నేర్పించారు, సంగీత సభలకు తీసుకువెళ్లి ఎమ్మెస్ సుబ్బలక్ష్మి వంటి పెద్దల కచేరీలు వినిపించేవారు.
సంగీతంపై ఆసక్తి
నాన్న ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతంపై మక్కువ ఏర్పడింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో చేరి సంగీతంలో గాత్రం డిప్లమా చేశాను. దాంతో వాగ్గేయకారుల గురించి లోతుగా అధ్యయనం చేయగలిగాను. ఈ నేపథ్యంలో రచించినదే “వాగ్గేయకార నాద యోగ వైభవం” నాటకం. త్యాగయ్య, అన్నమయ్య పురుష పాత్రలను స్త్రీలే పోషించి, ఢిల్లీతో సహా 20 పట్టణాలలో ప్రదర్శననిచ్చి మెప్పు పొందాం. “ముకుంద మాల శ్లోకాలకు రాగాలు కూర్చి, సరళ వ్యాఖ్యానంతో స్వయంగా పాడిన రికార్డు యూట్యూబ్‌లో ఉన్నది.
సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా
నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒకడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్. రెండవ వాడు తణుకులో అడ్వకేట్. నా మనవరాలు హరిప్రియ గాయని. నాట్యంలో ఎంమ్మే కూడా చేసింది. నా ఇద్దరు మనవలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. 90 ఏండ్ల వయసులో మా నాభర్త భమిడి విశ్వనాధ శర్మ ఇప్పటికీ ఎరువుల ఫాక్టరీలో మేనేజరుగా చేస్తున్నారు. 50 ఏండ్ల సంగీత బోధనానుభవంతో, 85 ఏండ్ల వయసులో నేను రాయసం రాజ్యలక్ష్మి సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నాను. కళాశాలలో డిప్లమా, ఎంఏ పరీక్షలకు విద్యార్థులను పంపిస్తున్నాను. పాడుతా తీయగా, స్వరాభిషేకం వంటి అనేక కార్యక్రమాల్లో మా విద్యార్థులు పాల్గొని పాడుతున్నారు. ప్రిన్స్ రామవర్మ, మల్లాది సూరిబాబు, ద్వారం లక్ష్మి వంటివారిచే వర్క్ షాపులు నిర్వహిస్తున్నాం. తాళ్ళపాక, హైదరాబాద్, తిరుపతి, విశాఖతో పాటు ఇంకా పరిసర పట్టణాలలో త్యాగరాజ, అన్నమయ్య ఆరాధనల్లో మా విద్యార్థులు పాల్గొని పాడుతుంటారు.
సాహిత్యంలోనూ…
నా శిష్యులే ఎంతో మంది నేడు గురువులై అనేకచోట్ల శాస్త్రీయ సంగీతాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇది నాకు ఎంతో గర్వకారణం. ఇక నా సాహిత్య విషయానికొస్తే గానకళ వేద మాతరం, శ్రీ పీఠం, ఈనాడు మొదలైన అనేక పత్రికలే కాక, అంతర్జాల పత్రికలలో కూడా.. కథలు, సంగీత, సాహిత్య వ్యాసాలు ప్రచురింపబడుతున్నవి.
ఇప్పటి వరకు పుస్తక రూపంలో..
వాగ్గేయకార నాదయోగ వైభవం, (సుమేథా వ్యాఖ్య సహిత) ముకుందమాల.. భక్తితత్వం, శ్రుతిదర్శనం-రూపక పంచకం (5.నాటకాలు), పాలంగి కథలు వంటివి ముద్రించాను. అలాగే కొన్ని అముద్రితాలు ఉన్నాయి.
బిరుదులు కొన్ని….
విజయవాడ స్వరఝరి వారు ‘సంగీత సేవా నిరత’, ద్వారం లక్ష్మి అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ వారిచే(గుంటూరులో) ‘సంగీత సేవా ప్రశస్తి’, పద్మశ్రీ, అన్నవరపు రామస్వామిగారిచే… సంగీత సాహిత్య శిరోమణి వంటి బిరుదులు అందుకున్నాను. అలాగే ఇటీవల శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫ్ నార్త్ అమెరికా. SAPNA. U. S.A వారిచే ‘శ్రీ కళా పూర్ణ’ అనే పురస్కారం అందుకున్నాను. ఈ సభలో (Usa) శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న నా మనవలు, గౌతమ భరద్వాజ, ఆత్రేయ భరద్వాజలు కచేరీ చేశారు. ప్రస్తుతం నేను నివసిస్తున్న మా తణుకు పట్టణంలో శాస్త్రీయ సంగీతం పరిఢవిల్లాలని తపిస్తున్నాను.
– అచ్యుతుని రాజ్యశ్రీ



