రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నూతన పాలక మండలిని రద్దు చేయాలి

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నూతన పాలక మండలిని రద్దు చేయాలి– ఎన్నికల ఎత్తుగడలో భాగమే సస్పెన్షన్‌
– మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ కనుసన్నల్లోనే కొత్త పాలక మండలి
– మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ కల్పించటంలో ప్రభుత్వాలు విఫలం
– విలేకర్ల సమావేశంలో ఐద్వా జాతీయ నాయకురాలు ఎస్‌ పుణ్యవతి
– ఉచిత బస్సు ప్రయాణం భేష్‌..
– అన్ని గ్రామాలకూ సౌకర్యం కల్పించాలి : రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇటీవల ఎన్నికైన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నూతన పాలకమండలిపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వేటువేయడం ఎన్నికల ఎత్తుగడలో భాగమేనని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) జాతీయ నాయకురాలు ఎస్‌ పుణ్యవతి విమర్శించారు. ఆ కమిటీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని మోటూరి ఉదయం భవన్‌లో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మి, నాయకులు కేఎన్‌ ఆశాలతతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డబ్ల్యూఎఫ్‌ఐ నూతన అధ్యక్షుడు సంజరుసింగ్‌ బీజేపీ ఎంపీ, అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ చరణ్‌సింగ్‌కు అత్యంత సన్నిహితుడని తెలిపారు. సంజరుసింగ్‌ను అడ్డుపెట్టుకొని మరోసారి రెజ్లింగ్‌ సమాఖ్యను ఏలాలని ఆయన భావిస్తున్నాడని అభిప్రాయపడ్డారు. తాత్కాలిక సస్పెన్షన్లతో మాయ చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. సంజరుసింగ్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన రోజు ఢిల్లీలోని నివాసంలో తానే గెలిచినంతగా బ్రిజ్‌భూషణ్‌ సంబురాలు చేసుకోవడమే దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. సంజరుసింగ్‌ ఎన్నికకు నిరసనగా సాక్షి మాలిక్‌ కుస్తీలకు స్వస్తి చెప్పగా.. బజరంగ్‌ పునియా, బధిర ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌ వీరేందర్‌ సింగ్‌ పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తామంటూ ప్రకటించారని గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఈ అంశం మరోసారి తెరపైకి వస్తే తమకు ప్రతికూలంగా మారుతుందని బీజేపీ భావించి ఉండవచ్చు, అందువల్ల ఇన్ని రోజులు పెదవి విప్పని బీజేపీ ఇటు సార్వత్రిక, అటు హర్యానా అసెంబ్లీ ఎన్నికల దష్ట్యానే ఇప్పుడు చర్యలు చేపట్టిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఎన్నికలు, ఓట్లు, సీట్ల యావ తప్పితే..మహిళల మనోభావాలు వీరికి పట్టవా? అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే సస్పెన్షన్‌ ఎత్తివేస్తే పరిస్థితి ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నదని వాపోయారు. అదే జరిగితే దేశ వ్యాప్త ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
అమలు కాని చట్టాలు..
మహిళల రక్షణ కోసం చట్టాలున్నప్పటికీ అమలు చేయటంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని పుణ్యవతి ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో స్త్రీకి ఉన్న భద్రత ప్రశ్నగానే మిగిలిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పని చేసే చోట వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారన్నారు. అన్ని చోట్ల కమిటీలు వేయాలని చట్టం చెప్పినప్పటికీ పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు.
మల్లు లక్ష్మి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అయితే బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని మూడు వేల గ్రామాలకు ఇప్పటికీ బస్‌ సౌకర్యం లేదని గుర్తు చేశారు. ఆయా గ్రామాల మహిళలకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బెల్ట్‌ షాపులు ఎత్తేయాలనీ, తద్వార పెడమార్గం పడుతున్న యువతను కాపాడాలన్నారు. మహిళలపై జరుగుతున్న వేధింపులు, లైంగిక దాడుల నుంచి రక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు నిబంధనల పేరుతో పేదలకు పథకాలను దూరం చేయొద్దని కోరారు.ఆ తర్వాత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నూతన పాలక మండలిని రద్దు చేయాలంటూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.

Spread the love