జులై 1 నుంచి అమలులోకి రానున్న నూతన చట్టాలు …

నవతెలంగాణ న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన న్యాయ చట్టాలు జులై 1 నుండి అమల్లోకి వస్తాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ ప్రకటించారు.ఈ చట్టాల అమలు నిర్ణయంపై కేంద్రం పున:పరిశీలన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆదివారం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. జులై 1 నుండి మూడు న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను ఇండియన్‌ పీనల్‌ కోడ్‌-1860, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ 1872, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల ప్రొసీజర్‌ 1973 ల స్థానంలో ఉంటాయని అన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఈ మూడింటిలో వినూత్నమైన ఆలోచనలు ఉన్నాయని అన్నారు. గతేడాది డిసెంబర్‌లో పార్లమెంట్‌ ఈ చట్టాలను ఏకపక్షంగా ఆమోదించింది. అదే నెలలో రాష్ట్రపతి ఆమోదం కూడా పొందాయి. అయితే ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో కేంద్రం నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది. జులై 1 నుండి ఈ చట్టాలు అమల్లోకి వస్తాయని ఫిబ్రవరి 25న కేంద్రం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పలువురు న్యాయవాదులు, నిపుణులు, ప్రతిపక్షాలు ఈ చట్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాలను నిలిపివేయాలంటూ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ న్యాయశాఖకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

Spread the love