Tuesday, August 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపాత కలెక్టర్‌ నిర్వాకమే

పాత కలెక్టర్‌ నిర్వాకమే

- Advertisement -

అందుకే నిషేధిత జాబితాలో సీఎం ఇల్లు
22ఏలో లక్షల ఎకరాలు 
చేర్చామన్నది అవాస్తవం
ఎవరూ ఆందోళన చెందొద్దు
దరఖాస్తుల్లో 98 శాతం 
రిజిస్ట్రేషన్లు పూర్తి
నకిలీ జీవోలు, బోగస్‌ మెమోల పేరుతో భూదందా
అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు
యూఎల్‌‌సీపై త్వరలో విధాన నిర్ణయం
ప్రభుత్వ భూమిని కొల్లగొట్టాలని 
చూస్తే సహించం : రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ఇల్లు 403 సర్వేనెంబర్‌‌లో 1,280 ఎకరాల భూమిలో ఉందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి చెప్పారు. రెండు ప్లాట్లు నిషేధిత జాబితాలో ఉన్నాయనీ, కానీ హైదరాబాద్‌ ‌పాత కలెక్టర్‌ ఆ సర్వే నెంబర్‌‌ను మొత్తం నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. అందుకే సీఎం ఇల్లుతోపాటు తనది కూడా 22ఏ పరిధిలో ఉందన్నారు. దాన్ని గుర్తించి వెంటనే సరిచేశామని చెప్పారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అధికారులు కొన్ని పొరపాట్లు చేశారని వివరించారు. సోమవారం హైదరాబాద్‌‌లోని రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 22ఏపై వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు. ప్రధాన ప్రతిపక్షం నాయకులు అబ‌ద్దాల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తున్నారని అన్నారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదన్నారు. 22ఏ ద్వారా వచ్చిన ద‌ర‌ఖాస్తులు ఫాస్ట్‌ట్రాక్‌లో పరిశీలించి ప‌రిష్కరించామని చెప్పారు. 98 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని వివరించారు. 22ఏలో లక్షల ఎకరాలను చేర్చామన్నది అవాస్తవమని అన్నారు.
22ఏలో తప్పు జరిగితే సరిదిద్దుతామనీ, అక్రమమైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ భూమిని ప్రయివేట్‌గా చూపించి కొల్లగొట్టాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. రిజిస్ట్రేష‌న్ స్లాట్ ర‌ద్దుచేసుకున్న వారి సొమ్మును వారం రోజుల్లో చెల్లిస్తామని స్పష్టం చేశారు.

ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టడం తప్పా
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని రెండు రెవెన్యూ గ్రామాల్లో 122 ఎకరాలు, మరోచోట 400కుపైగా ఎకరాలు కలిపి సుమారు 522 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని పొంగులేటి చెప్పారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను భారీ విస్తీర్ణాల్లో ప్రయివేట్ వ్య‌క్తుల‌కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ఇలాంటి భూముల‌ను నిషేధిత జాబితాలో పెట్ట‌డం త‌ప్పా?అని ప్ర‌శ్నించారు. సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డి ప‌ల్లి రెవెన్యూ గ్రామంలో 1958కు ముందు అసైన్‌మెంట్ జరిగినట్టు చూపిస్తూ, సరైన ప్రభుత్వ రికార్డులు లేకుండానే భూములపై హక్కులు సృష్టించి రియల్‌ ఎస్టేట్‌కు ధారాదత్తం చేశారని మంత్రి వివరించారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో సర్వే నెంబర్ 172 ప్రభుత్వ భూమి, 173 ప్రయివేట్ భూమి అని మంత్రి చెప్పారు. 173 పేరుతో అనుమతులు తీసుకుని 172 ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టారని వివరించారు. ఆ ప్రభుత్వ భూమిని 22ఏలో పెట్టకూడదా?అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కాపాడటం తమ బాధ్యత అని వివ‌రించారు.
 మేడ్చల్ జిల్లా పర్వతాపూర్ ప్రాంతంలో ప్రధాన రెవెన్యూ గ్రామం, దానికి అనుబంధ ప్రాంతానికి ఒకే తరహా సర్వే నెంబర్లు కేటాయించడం వల్ల భూ వివాదాలు తలెత్తాయని మంత్రి చెప్పారు. సర్వే నెంబర్లను సక్రమంగా పునర్వ్యవస్థీకరించి, సమగ్ర సర్వే ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు.
మహేశ్వరం మండలంలోని 22 ఎకరాల సర్వే నెంబర్‌లో రెండు ఎకరాలు భూదాన్ భూమి ఉంటే మొత్తం 22 ఎకరాలకు పాస్‌బుక్ జారీ కావడం, భూదానం చేసిన రెండు ఎకరాలను ప్రత్యేకంగా గుర్తించడంలో సమస్య ఏర్పడ‌డంతో మొత్తం 22 ఎక‌రాల‌ను నిషేధిత జాబితాలో పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

​భూహక్కుదారులకు న్యాయంచేస్తాం
భూదాన్, అసైన్డ్, ప్రభుత్వ భూముల విషయంలో రికార్డులను కేసుల వారీగా పరిశీలించి, వాస్తవ భూహక్కుదారులకు న్యాయం చేస్తామని పొంగులేటి చెప్పారు. ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు నకిలీ జీఓలు, మెమోలు, అధికారుల సంతకాలతో బోగస్ పత్రాలు సృష్టిస్తున్న వ్యవహారాలను గుర్తించామని ఆ మేర‌కు క్రిమిన‌ల్ కేసుల న‌మోదుకు ఆదేశాలిస్తున్నామ‌న్నారు. మేడ్చల్ జిల్లాలో ఏప్రిల్‌ 22‌న జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్టు చూపిస్తూ నకిలీ మెమోను, మరోచోట జూన్‌ ‌రెండున స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పేరుతో బోగస్ సర్టిఫికెట్‌ను సృష్టించి రిజిస్ట్రేషన్ కోరిన వ్యవహారాలను గుర్తించామని చెప్పారు. సంబంధిత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించామని అన్నారు.

ప్రధాన ప్రతిపక్షం కోరితే సెట్‌ ‌దర్యాప్తు
రాష్ట్రంలో పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (యూఎల్‌‌సీ)కి సంబంధించి త్వరలోనే ప్ర‌భుత్వం విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సీఎస్‌-7, ‌సీఎస్‌-14కు సంబంధించి 2017లో బీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి సంబంధించిన ఓ ప‌త్రిక ఎమ్‌‌డీ ఓ భూస్వామి నుంచి ఎస్ క్లాస్ బెంజి కారు తీసుకుని ఐదు డాక్యుమెంట్ల ద్వారా 811 ఎక‌రాల భూమిని రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నారని అన్నారు. ఈ అంశంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోరితే సెట్ ద‌ర్యాప్తున‌కు ఆదేశిస్తామ‌మన్నారు. యూఎల్‌‌సీకి దరఖాస్తు చేయని భూములు నిషేధిత జాబితాలో ఉండటం సహజమేనని అన్నారు.
22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఇప్పటివరకు 1,162 కాల్స్ వచ్చాయని వివరించారు. ప్రజలను భయపెట్టడం ప్రభుత్వ విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ముఖ్య కార్య‌ద‌ర్శి లోకేశ్‌ కుమార్, స్టాంప్స్ అండ్‌ రిజిస్ట్రేష‌న్స్ ఐ‌జీ రాజీవ్‌గాంధీ హ‌నుమంతు, హైద‌రాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి ‌జిల్లాల క‌లెక్ట‌ర్లు, జిల్లా రిజిస్ట్రార్లు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -