భూభారతి రికార్డులో 2,49,97,312 ఎకరాలు వివాదంలో ఉన్న వ్యవసాయ భూమి 3,73,524 ఎకరాలు
భూభారతి రికార్డులో 2,49,97,312 ఎకరాలు
వివాదంలో ఉన్న వ్యవసాయ భూమి 3,73,524 ఎకరాలు
నిషేధిత జాబితా నుంచి తొలగించింది 23,136 ఎకరాలు
ఆస్తిని అమ్మడానికి, కొనడానికి వీల్లేని పరిస్థితి
అధికారుల తప్పిదం ప్రజలకు శాపం
రిజిస్ట్రేషన్ జరగక భయాందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో 22ఏ పరిధిలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ జాబితాలో ఉన్న భూమిని అమ్మడానికి, కొనడానికి అవకాశముండదు. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సొంత ఆస్తిని అమ్మకూడదనే నిబంధనతో మనోవేదన చెందుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో అయితే అపార్ట్‌మెంట్లు కూడా 22ఏ పరిధిలో ఉండడంతో వాటిని కొనుగోలు చేసిన వారు భయాందోళనలో ఉన్నారు. అయితే 22ఏ పరిధిలో ఉన్న భూమి మొత్తం వివాదాస్పదమైంది కాదు. ప్రయివేటు వ్యక్తులు లేదా సంస్థలకు చెందిన భూమికి సంబంధించింది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 22ఏలో ఉన్న భూములను ప్రజలకు లేదా సంస్థలకు ప్రభుత్వమే ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సమాచారాన్ని అప్‌డేట్ చేసి ఆ భూములకు సంబంధించిన వివరాలను తీసివేయకుండా రెవెన్యూ అధికారులు హైకోర్టుకు సమర్పించారు. 22ఏ పరిధిలో మొత్తం భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరడం గమనార్హం. అయితే ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తున్నది. ప్రయివేటు భూములు, ఆస్తికి సంబంధించిన ఆధారాలుంటే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని భరోసా ఇచ్చింది.
22ఏ అంటే ఏమిటీ?
1999లో రిజిస్ట్రేషన్ చట్టం 1908 చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం ప్రయత్నించింది. దాన్ని కోర్టు నిలిపేసింది. 2007లో సవరించి మళ్లీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని తెచ్చారు. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ కింద నిర్దిష్ట కేటగిరీలకు చెందిన భూములను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చుతారు. ఇలాంటి భూములపై సాధారణంగా క్రయ, విక్రయాలు, బదలాయింపులు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోతాయి. ఆ కేటగిరీలో ప్రభుత్వ, అటవీ, అసైన్డ్, చెరువులు-శిఖం, సీలింగ్, దేవాదాయ, వక్ఫ్ వంటి భూములుంటాయి. అవి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. వాటిని అక్రమ బదలాయింపుల నుంచి రక్షించడమే ఈ నిషేధ జాబితా ప్రధాన ఉద్దేశం. 22ఏ నిబంధన వల్లే ప్రభుత్వ భూములు పరిరక్షించబడుతున్నాయన్న అభిప్రాయం ఉన్నది. లేదంటే విచ్చలవిడిగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగే ప్రమాదం లేకపోలేదు.
భూ యజమానులకు ఇదే సమస్య
భూములను తప్పుగా 22-ఏ జాబితాలో చేరాయని భావిస్తున్న ప్రయివేటు భూ యజమానులకు ఇదే నిబంధన పెద్ద సమస్యగా మారింది. భూమి సొంతమని రికార్డులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో అమ్మకం, కొనుగోలు, రుణాలు, కుటుంబ అవసరాల కోసం భూమిని వినియోగించుకోవడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.
నిషేధిత జాబితాలో ఆ భూములే అధికం
రాష్ట్రంలో భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సెక్షన్ 22-ఏ పరిధిలో ఉన్న నిషేధిత జాబితా భూములపై స్పష్టత వచ్చింది. భూ భారతి రికార్డుల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 2,49,97,312 ఎకరాల భూమి నమోదై ఉంది. ఇందులో పలు కేటగిరీలకు చెందిన 98,02,544.03 ఎకరాలు భూమి 22ఏ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్నది. ప్రభుత్వానికి, ప్రయివేటు ఖాతాదారులకు మధ్య కోర్టు వివాదంలో ఉన్న భూమి 3,73,524 ఎకరాలు. అటవీ భూములు 42,61,531.32 ఎకరాలు, అసైన్డ్ భూములు 24,63,930.05 ఎకరాలు, ప్రభుత్వ భూములు 16,11,622.35 ఎకరాలు, చెరువులు, శిఖం కింద మరో 12,04,314.04 ఎకరాలు, ప్రభుత్వ భూముల్లో ప్రజా ఆస్తులు 1,50,749.62 ఎకరాలు, దేవాదాయ భూములు 49,143.17 ఎకరాలు, రోడ్లు 45,875.13 ఎకరాలు, ఇతర భూములు 15,378.35 ఎకరాలు కలిపి 98,02,544.03 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే నిషేధిత జాబితాలో అటవీ, అసైన్డ్, ప్రభుత్వ, చెరువులు, శిఖం భూములే అధికంగా ఉండడం గమనార్హం. ఈ వివరాలను రెవెన్యూ శాఖ అధికారికంగా విడుదల చేసింది. అయితే నిషేధిత జాబితాలో ఉన్నంత మాత్రాన ఆ భూమి మొత్తం ప్రయివేటు వ్యక్తులకు చెందినది కాదనేది గమనించాలి. అయితే ప్రయివేటు భూమి కొన్ని కూడా అందులో చేరడం వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
ప్రభుత్వం, ప్రయివేటు వారి మధ్య భూవివాదం
ప్రభుత్వం–ప్రయివేటు ఖాతాదారుల మధ్య వివాదంలో ఉన్న 3,73,524 ఎకరాల వ్యవసాయ భూమి 22-ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చబడింది. 22-ఏ జాబితాలో భూమి తప్పుగా చేరిందని భావించే వారికి భూ భారతి పోర్టల్ ద్వారా పరిష్కారం పొందే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. సంబంధిత భూ యజమాని పోర్టల్‌లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు రికార్డులు, ఆధారాలను పరిశీలించి ఆ భూమిని 22-ఏలో కొనసాగించాలా? లేక జాబితా నుంచి తొలగించాలా? అనే నిర్ణయం తీసుకుంటారు. ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే క్రయ, విక్రయాలకు దోహదపడుతుంది.
23,136 ఎకరాలకు విముక్తి
2023-24 నుంచి ఇప్పటివరకు 23,136 ఎకరాల భూమిని 22-ఏ జాబితా నుంచి తొలగించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. సమస్య పరిష్కారానికి దరఖాస్తుల పరిశీలన ద్వారా కొంత మేర భూమిని నిషేధ జాబితా నుంచి రెవెన్యూ శాఖ విముక్తి చేసింది. ఆ భూముల యజమానులు వాటిని అమ్ముకోవడానికి, బ్యాంకుల ద్వారా రుణం పొందడానికి, ఇతరులకు బదలాయించడానికి వీలవుతుంది.
నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఆటంకం
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ప్రాపర్టీ ట్యాక్స్ రశీదులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ రికార్డులో 22ఏ పరిధిలో ఉంటే ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్ల కొనుగోలు–అమ్మకాలు వంటివి నిలిచిపోతాయి. హైదరాబాద్, పరిసర జిల్లాల్లో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. 20, 30 ఏండ్ల కింద నిర్మించిన అపార్ట్‌మెంట్లు, ప్రస్తుతం కట్టబోయే అపార్టమెంట్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా 22ఏ జాబితాలో ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించడానికి అధికారులకు ముడుపులు ఇచ్చినట్టు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు 22ఏ పరిధిలో ఉంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పరిష్కారం కాకుంటే కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది.
కాంగ్రెస్‌పై ప్రభావం
22ఏ నిషేధిత జాబితా వ్యవహారం ఇప్పుడు రాజకీయ వివాదంగా మారింది. గతంలో బీఆర్‌ఎస్ ఓడిపోవడానికి ధరణి ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు కాంగ్రెస్‌పైనా హైడ్రా, 22ఏ నిషేధిత జాబితా కూడా అలాగే ప్రభావం చూపుతుందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని అంటున్నారు. ఇది కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తుందని చెప్తున్నారు.
భూ భారతి రికార్డుల్లో నిషేధిత భూముల వివరాలు
సంఖ్య భూమి కేటగిరీ విస్తీర్ణం (ఎకరాలు)
అటవీ భూములు 42,61,531.32
అసైన్డ్ భూములు 24,63,930.05
ప్రభుత్వ భూములు 16,11,622.35
నీటి వనరులు /శిఖం 12,04,314.04
ప్రభుత్వ భూముల్లో ప్రజా ఆస్తులు 1,50,749.62
దేవాదాయ భూములు 49,143.17
రోడ్లు 45,875.13
ఇతరాలు 15,378.35
మొత్తం 98,02,544.03
22ఏ పరిధిలో 98,02,544 ఎకరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



