ఆయుధ శిక్షణ పొందుతున్న పౌరులు, యువత
దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు
టెహ్రాన్ : ఇరాన్‌పై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపులతో టెహ్రాన్‌లో ప్రజలు అప్రమత్తమయ్యారు. వేలాది మంది ప్రజలు వీధులలోకి వచ్చి ప్రభుత్వానికి మద్దతుగా, అమెరికాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు. రాజధాని టెహ్రాన్ పొరుగునే ఉన్న తజ్రిష్ స్క్వేర్ సమీపంలో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడి ‘డెత్ టు అమెరికా’ అంటూ నినాదాలు చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో జరిగిన ర్యాలీలలో ఇరాన్ పతాకాలు రెపరెపలాడాయి. ‘దేశం కోసం…ప్రజల కోసం నా జీవితాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని తయానా అనే యువతి భావోద్వేగంతో చెప్పారు. ప్రజలు, సైన్యం, మన కమాండర్లు…అందరూ ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని, పోరాటానికి మనసా వాచా కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.
అణు, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానం ఇరాన్ సరిహద్దులంత ముఖ్యమైనవని, వాటిని కాపాడుకుంటామని ఓ వృద్ధుడు చెప్పారు. ‘మాకు అణుశక్తి, స్వచ్ఛమైన ఇంధనం కావాలి. అంతే కానీ బాంబులు కాదు’ అని అన్నారు. ఇరాన్ వద్ద అణు బాంబులు లేవన్న విషయం ట్రంప్‌కు తెలుసునని, అయినా ఆయన తమపై దాడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమెరికా`ఇజ్రాయిల్ సేనలు వెంటనే దాడులు జరుపుతాయన్న వదంతులు వ్యాపిస్తుండడంతో ఇక యుద్ధం అనివార్యమని ఇరానీయులు నిర్ణయానికి వచ్చారు.
యుద్ధం ముగియలేదని తనకు తెలుసునని, ట్రంప్‌కు చర్చల విషయంలో చిత్తశుద్ధి లేదని, ఆయన డిమాండ్లకు అంగీకరించినా దాడులు చేస్తారని ఫాతిమా అనే యువతి తెలిపారు. వాస్తవానికి ఫిబ్రవరి 28న అమెరికా‘ఇజ్రాయిల్ సేనలు దాడులు ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ప్రతి సాయంత్రం ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి వేళలలో సమావేశాలు నిర్వహిస్తూ యుద్ధ సన్నద్ధతలపై చర్చిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో పౌరులకు ఆయుధాలను ఎలా ఉపయోగించాలనే విషయంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రజలు ఆయుధాలు చేబూని సిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వ టెలివిజన్ పిలుపు ఇస్తోంది. దేశంలో ఎక్కడ చూసినా ఆయుధ శిక్షణ పొందుతున్న పౌరులు, యువతీ యువకులే కన్పిస్తున్నారు. అయితే కొందరు మాత్రం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. తాము శాంతిని వాంఛిస్తున్నామని ఓ యువతి చెప్పారు. అయితే మొత్తంమీద ఇరాన్‌లో ఎక్కడ చూసినా యుద్ధ సన్నద్ధత కన్పిస్తోంది.



