Wednesday, May 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌పై దాడులు వాయిదా వేస్తున్నా

ఇరాన్‌పై దాడులు వాయిదా వేస్తున్నా

- Advertisement -

ఒప్పందం కుదురుతుందనే అనుకుంటున్నా
వాషింగ్టన్ : ఇరాన్‌పై మంగళవారం దాడి చేయాలన్న తన ప్రణాళికను వాయిదా వేసుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేతల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని సోమవారం ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చలు మరింత తీవ్రమవుతున్నాయని ట్రంప్ అన్నారు. అయితే ఒకవేళ ఒప్పందం కుదరని పక్షంలో ఏ క్షణంలో అయినా ఇరాన్‌పై పూర్తి స్థాయిలో భారీ దాడులకు సిద్ధంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించానని తెలిపారు. అమెరికాకు, మధ్యప్రాచ్యంలోని మిత్ర దేశాలకు ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నదని ప్రాంతీయ నేతలు ఆశాభావంతో ఉన్నారని చెప్పారు. ‘ఈ ఒప్పందంలో ముఖ్యమైన విషయమేమంటే ఇరాన్ వద్ద ఎలాంటి అణ్వాయుధాలు ఉండవు’ అని స్పష్టం చేశారు. అనంతరం శ్వేతసౌధంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ఒప్పందానికి ఇరాన్ చేరువగా ఉన్నదని తాను గతంలో భావించానని, అయితే ఇప్పుడు పరిస్థితి ‘కొంచెం భిన్నంగా’ ఉన్నదని చెప్పారు. ‘ఇది చాలా సానుకూల పరిణామం. అయితే దీనివల్ల ఏదైనా ఫలితం వస్తుందా రాదా అన్నది చూడాల్సి ఉంది’ అని అన్నారు.

ఒప్పందం కుదరబోతోందని గతంలో అమెరికా అధికారులు అభిప్రాయపడ్డారని, అయితే ఇప్పుడది కొంచెం భిన్నంగా ఉందని తెలిపారు. దాడులను కొన్ని రోజుల పాటు వాయిదా వేయాలని గల్ఫ్ దేశాలు కోరాయని, అయితే ఈ విరామం చాలా కాలం కొనసాగవచ్చునని చెప్పారు. ‘రేపు మేము పెద్ద దాడి చేయడానికి సిద్ధపడుతున్నాము. అయితే దానిని కొద్ది కాలం పాటు వాయిదా వేశాను. బహుశా శాశ్వతంగా కూడా….కానీ కొద్ది కాలం పాటు వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మేము ఇరాన్‌తో బాగా చర్చలు జరిపాం. వాటి ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం’ అని అన్నారు. దాడులను రెండు మూడు రోజులు…అంటే కొద్ది కాలం పాటు వాయిదా వేయగలమా అని సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ కోరాయని, ఎందుకంటే ఒప్పందానికి చేరువగా ఉన్నామని అవి భావిస్తున్నాయని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్న వైఖరిని ట్రంప్ పునరుద్ఘాటిస్తూ శాంతి ప్రతిపాదనకు గల్ఫ్ దేశాలు సంతృప్తి చెందితే అమెరికా కూడా సానుకూలత వ్యక్తం చేస్తుందని అన్నారు.

దాడులను నిలిపివేయాలని కొన్ని ఇతర దేశాలు కూడా కోరాయని చెప్పిన ట్రంప్ వాటి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ‘ఈ మూడు దేశాలతో పాటు మరికొన్ని దేశాల నాయకులు కూడా నాకు ఫోన్ చేశారు. వారు ఇరాన్‌తో నేరుగా సంభాషిస్తున్నారు. ఒప్పందం కుదరడానికి మంచి అవకాశాలు ఉన్నాయని అనిపిస్తోంది. ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించకుండానే ఒప్పందాన్ని కుదుర్చుకోగలిగితే నేను చాలా సంతోషిస్తాను’ అని సీఎనఎన్‌కు చెందిన క్రిస్టెన్ హమ్స్‌కు ట్రంప్ చెప్పారు. కాగా చర్చల సరళిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్ సీనియర్ సైనికాధికారులతో చర్చించారని, వారు కొన్ని ప్రతిపాదనలు చేశారని, ఇరాన్‌లోని లక్ష్యాలపై మంగళవారం దాడులు దాడులు చేయాలని అధ్యక్షుడు నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయ వర్గాలు అంతకుముందు తెలియజేశాయి. అయితే ఏ లక్ష్యాలపై ఏ స్థాయిలో దాడి చేయాలన్నది ట్రంప్ వెల్లడించలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -