విజేతగా నిలిచి..ఇంటికెళ్లలేని దుస్థితి!

Being a winner..the plight of not being able to go home!– మణిపూర్‌ అథ్లెట్‌ రోషిబినా దేవి కన్నీటిగాథ
నవతెలంగాణ-హాంగ్జౌ
ఆసియా క్రీడల్లో పతకం సాధించిన అథ్లెట్లు సహజంగానే విజయ సంబురాలు, అభిమానుల స్వాగతం నడుమ స్వరాష్ట్రానికి చేరుకుంటారు. ప్రతి క్రీడాకారుడు కోరుకునే, కలలు కనే హోమ్‌కమింగ్‌ ఇదే. కానీ మణిపూర్‌ అథ్లెట్లు ఆ ఆనందానికి నోచుకోలేదు. రాజకీయ ప్రేరేపిత చిచ్చుతో రెండు తెగల నడుమ గత ఐదు నెలలుగా మణిపూర్‌ మంటల్లో కాలిపోతున్న సంగతి ప్రపంచానికి తెలిసిన సంగతే. 2023 ఆసియా క్రీడల్లో వుషూ (మార్షల్‌ ఆర్ట్స్‌)లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన రోషిబినా దేవిది మణిపూర్‌లోని ఓ కుగ్రామం. విద్వేషం మత్తులో హింస రాజ్యమేలుతున్న మణిపూర్‌లో ఉండటం క్షేమం కాకపోవటంతో రోషిబినా దేవి ఇంపాల్‌లో సారు స్పోర్ట్స్‌ హాస్టల్‌లోనే ఉంటూ సాధన చేసింది. గత ఐదు నెలలుగా రోషిబినా దేవి ఇంటి ముఖం చూసిందే లేదు. ఇప్పుడు ఆసియా క్రీడల్లో పతకం సాధించినా విజయ గర్వంతో స్వరాష్ట్రం వెళ్లలేదు, పతకం సంబురం కుటుంబంతో కలిసి పంచుకోలేదు. గురువారం మహిళల వుషూ ఫైనల్లో రజతం అందుకున్న రోషిబినా దేవి.. మణిపూర్‌, కుటుంబం దుస్థితి తలచుకుంటూ కన్నీంటి పర్యంతమైంది. ఫైట్‌ ముగిసినా.. తన రెండు గ్లౌవ్స్‌తో పంచ్‌లు విసురుతూ కనిపించటం అక్కడ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను కట్టిపడేసింది. భయం.. భయంగా బతుకుతున్నారు : ‘అవును, ఇప్పుడు అక్కడ మాకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మణిపూర్‌లో అందరూ భయం భయంగా బతుకుతున్నారు. త్వరలోనే పరిస్థితులు సద్దుమణిగి, ప్రజలు శాంతియుతంగా మెలుగుతారని ఆశిస్తున్నాను. రాష్ట్రంలో చెలరేగిన హింసతో కండ్ల ముందు అంతా కాలిపోతుండటం ఎంతో బాధగా ఉంది. నేను ఇప్పుడు అక్కడికి (మణిపూర్‌) వెళ్లలేను. అక్కడ ప్రజలను కాపాడుతూ, ప్రజల కోసం శ్రమిస్తున్న వారికి ఈ రజత పతకం అంకితం ఇస్తున్నాను. మణిపూర్‌లో హింస చెలరేగుతున్న సమయంలోనే నా ట్రైనింగ్‌ మొదలైంది. ఈ సమయంలో నేను ఇంటికి వెళ్లనేలేదు. మా నాన్న ఓసారి ఇంపాల్‌లోని హాస్టల్‌కు వచ్చి నన్ను చూసి వెళ్లారు. పరిస్థితులు మరీ దారుణంగా మారడంతో.. రోజు మా కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడవద్దని కోచ్‌లు చెప్పారు. కేవలం ఆదివారం మాత్రమే ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. నన్ను గ్రామానికి రావద్దని మా కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంపాల్‌లోని హాస్టల్‌లో ఉండటమే సురక్షితమని, ఇంటికి రావద్దని చెప్పారు. దీంతో నేను నెలలుగా ఇంటికి దూరమయ్యాను. ఇప్పుడు ఆసియా క్రీడల్లో పతకం సాధించినా.. ఇంటికి ఎప్పుడు వెళ్తానో తెలియదు’ అని రోషిబినా దేవి భావోద్వేగంతో కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది. మణిపూర్‌లో అందరూ భయం నీడలో బతుకుతున్నారు. విద్వేషం, హింసతో నేను ఇన్నాండ్లు ఇంటికి, కుటుంబానికి దూరమయ్యాను. ఇప్పుడు ఆసియా క్రీడల్లో మెడల్‌ సాధించినా.. ఇంటికి ఎప్పుడు వెళ్తానో నాకే తెలియదు. మణిపూర్‌లో శాంతి కోసం పాటుపాడుతూ, ప్రజలను కాపాడుతున్న వారికి ఆసియా క్రీడల సిల్వర్‌ మెడల్‌ అంకితం చేస్తున్నాను’
– రోషిబినా దేవి

Spread the love