రెగ్యులర్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

– టీవీవీపీ కమిషనర్‌కు టీయుఎంహెచ్‌ఇయూ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
డాక్టర్ల నుంచి దిగువస్థాయి రెగ్యులర్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) కమిషనర్‌ డాక్టర్‌ అజరు కుమార్‌కు ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహ్మద్‌ ఫసియొద్దీన్‌, కె.యాదానాయక్‌, టీవీవీపీ విభాగం కార్యదర్శి భైరపాక శ్రీనివాస్‌ వినతిపత్రం సమర్పించారు. వైద్యవిధాన పరిషత్‌ లో ఉద్యోగులకు జీవో 317 అమలు చేయకపోవడానికి కారణాలేంటని వారు ప్రశ్నించారు. 1999 బ్యాచ్‌కి చెందిన స్టాఫ్‌ నర్సులతో పాటు, చాలా ఏండ్లుగా ఎదురు చూస్తున్న మినిస్టీరియల్‌ స్టాఫ్‌, పారామెడికల్‌ సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ఫార్మసీ సూపర్‌ వైజర్‌ పోస్టులను జిల్లాకు ఒకటి చొప్పున కేటాయించాలనీ, రేడియోగ్రాఫర్లకు చీఫ్‌ రేడియోగ్రాఫర్‌గా పదోన్నతులు కల్పించాలని, ఎంప్లాయీస్‌ ఐడీ నెంబర్‌తో పాటు హెల్త్‌ కార్డులను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఎనిమిది టీవీవీపీ ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా ఉన్నతీకరించిన నేపథ్యంలో వాటిలో పని చేస్తున్న డాక్టర్లకు డీఎంఈ పరిధిలో పని చేసేందుకు అనుమతించారని వారు తెలిపారు. కానీ అదే ఆస్పత్రుల్లో పని చేసే నర్సింగ్‌, మినిస్టీరియల్‌ స్టాఫ్‌, ఇతర ఉద్యోగులకు మాత్రమే ఆ అవకాశాన్ని నిరాకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంతో సంప్రదించి అనుమతి ఇప్పించాలని కమిషనర్‌కు విన్నవించారు. నాలుగో తరగతి ఉద్యోగులకు విద్యార్హతలను బట్టి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love