వైద్యారోగ్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

The problems of the employees of the medical department should be solved– ప్రజావాణిలో సీఐటీయూ నేతల వినతిపత్రాల సమర్పణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యారోగ్యశాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌,హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సీఐటీయూ) కోరింది. ఈ మేరకు ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు భూపాల్‌ నేతృత్వంలో నాయకులు మంగళవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఎంపిహెచ్‌ఏ ఫిమేల్‌ (ఏఎన్‌ఎం) సర్వీసులను క్రమబద్ధీకరించాలనీ, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి కాంట్రాక్ట్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులర్‌ చేయాలని కోరారు.అలాగే గతంలో పెరిగిన జీతభత్యాల బకాయిలను కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు అటానమస్‌ హౌదాను రద్దుచేసి ప్రభుత్వంలో కలపాలని, 010 హెడ్‌ కింద వేతనాలు, హెల్త్‌ కార్డులివ్వాలని పేర్కొన్నారు. కాలయాపన చేయకుండా మొత్తం నర్సింగ్‌ క్యాడర్‌కు వెంటనే పదోన్నతులు కల్పించాలనీ, 317 జీవో అమలు విషయంలో ఉద్యోగుల ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎఫ్‌డీహెచ్‌ఎస్‌ సర్వీస్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలనీ, వారి సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పేషెంట్‌ కేర్‌, శానిటేషన్‌, స్వీపర్‌ , సెక్యూరిటీ సర్వీస్‌లలో ఉన్న కాంట్రాక్టు అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు కనీస వేతనం రూ.15,600 అమలు చేయాలని ప్రత్యేకంగా కోరారు. కాంట్రాక్టర్లు రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు మాత్రమే ఇచ్చి దోపిడీ చేస్తున్నారని వివరించారు. కార్మిక చట్టాల ప్రకారం పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఇతర సౌకర్యాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌లో పనిచేస్తున్న 17 వేల మంది కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలని, వేతనాలు పెంచాలని వినతిపత్రం అందజేశారు. ఇందులో గత పీఆర్సీలో అన్యాయం జరిగిన కమ్యూనిటీ ఆర్గనైజర్లు, మెడికల్‌ ఆఫీసర్‌ అసిస్టెంట్లు, నాలుగో తరగతి సిబ్బందికి వెంటనే పీఆర్సీ అమలు చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, పర్మినెంట్‌ ఉద్యోగుల కనీస బేసిక్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పర్మినెంట్‌ ఉద్యోగులైన ఎంపీహెచ్‌ఏ ఫిమేల్‌ ఏఎన్‌ఎంలకు గత 20 ఏండ్లుగా పదోన్నతులు కల్పించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తక్షణమే ప్రమోషన్‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. 108లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని, ఆరోగ్యశ్రీ సిబ్బందికి క్యాడర్‌ చేంజ్‌ చేసి పీఆర్సీ ప్రకారం సమాన పనికి సమాన వేతనం, జీతబత్యాలు ఇవ్వాలని పేర్కొన్నారు. వినతిపత్రాలు సమర్పించిన వారిలో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల నుంచి నర్సింగ్‌ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది హాజరయ్యారు. యూనియన్‌ హైదరాబాద్‌ అధ్యక్షులు కుమారస్వామి, రాష్ట్ర నాయకులు భూలక్ష్మి, మరియమ్మ సువర్ణ లత, సునీత తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగులకు భద్రత కల్పించండి  అవినీతిపై విచారణ జరిపించండి ప్రజావాణిలో ఆస్పత్రి స్వీపర్‌ పిర్యాదు
సుల్తాన్‌ బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగులకు భద్రత కల్పించడంతో పాటు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మి అవినీతిపై విచారణ జరిపించాలని ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న స్వీపర్‌ ఎస్‌.ఏ.అన్వర్‌ పాషా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 1992 నుంచి స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్న తాను అందరి మన్ననలు అందుకున్నానని తెలిపారు. అయితే 2018లో సూపరింటెండెంట్‌గా రాజ్యలక్ష్మి బాధ్యతలు స్వీకరించాక తన ప్రాథమిక హక్కులైన జీతం, ఇంక్రిమెంట్‌, సరెండర్‌ లీవులు జీపీఎఫ్‌ వంటివి ఉద్దేశపూర్వకంగా ఆపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎల్‌, సీఎల్‌లను తగ్గించి వేధించిందని ఫిర్యాదు చేశారు.
2018 జూలైలో ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆస్పత్రిలో అవినీతి తారాస్థాయికి చేరిందనీ, పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బంది ద్వారా పేద రోగుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నదన్న ఆరోపణలతో విజిలెన్స్‌ విచారణ జరిపిందని గుర్తుచేశారు. ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులను పూర్తిగా తొలగించిన ఆమె వైద్యనిబంధనల మేరకు కనీసం ఫస్ట్‌ ఎయిడ్‌ ట్రైనింగ్‌ సర్టిఫికెట్‌ లేని పారిశుధ్య కార్మికులను అక్కడ పని చేయిస్తున్నదని తెలిపారు. పేద రోగుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెగ్యులర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ప్రయివేటు ఉద్యోగులను ఆమె ప్రోత్సహిస్తున్నదని ఆరోపించారు. మెమోలు, ఛార్జ్‌ మెమోలు రెగ్యులర్‌గా ఇస్తూ ఉద్యోగులకు కనీస గౌరవం లేకుండా చేస్తున్నదని తెలిపారు. ఇదే విషయంపై గతంలో వైద్యారోగ్యశాఖ మాజీ కార్యదర్శి రిజ్వీతో పాటు మాజీ డీఎంఈ డాక్టర్‌ కె.రమేశ్‌ రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని తెలిపారు.
పరిష్కరించకుంటే… కుటుంబమంతా ఆకలిచావులే
ఇప్పటికే తాను ఆర్థికంగా, మానసికంగా చితికిపోయాననీ, తనపై ఆరుగురు ఆధారపడి ఉన్నారనీ, ఈ సమస్యను పరిష్కరించకుంటే కుటుంబమంతా ఆకలిచావులకు గురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. హాజరు పట్టికలో నుంచి తన పేరును తొలగించారనీ, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ సూర్యప్రకాశ్‌, ఇన్‌వార్డ్‌ సెక్షన్‌ క్లర్క్‌ ఎ.ఎస్‌.కిరణ్‌ కుమార్‌ తన దరఖాస్తును తీసుకునేందుకు నిరాకరిస్తున్నారనీ, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు.

Spread the love