పరిమితికి మించి రేడియేషన్‌.. యాపిల్‌ ఫోన్ల విక్రయాలు బంద్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐఫోన్‌ 12 పరిమితికి మించి రేడియేషన్‌ను విడుదల చేస్తున్నదని, ఆ మాడల్‌ అమ్మకాలను ఫ్రాన్స్‌లో నిలిపివేయాలని ఆ దేశానికి చెందిన నేషనల్‌ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ (ఏఎన్‌ఎఫ్‌ఆర్‌) యాపిల్‌ కంపెనీని ఆదేశించింది. ఇటీవల 141 ఫోన్లను పరీక్షించగా.. వాటిలో ఐఫోన్‌ 12 అధిక స్మార్ట్‌ఫోన్స్‌ స్పెసిఫిక్‌ అబ్జార్‌ప్సన్‌ రేట్‌ (ఏఎస్‌ఆర్‌)ను కలిగి ఉందని గుర్తించినట్టు రేడియేషన్‌ ప్రీక్వెన్సీని పర్యవేక్షించే ఈ సంస్థ వెల్లడించింది. ఆ ఫోన్లలో ఎలక్ట్రోమాగ్నెటిక్‌ ఎనర్జీ అబ్జార్‌ప్సన్‌ కిలోగ్రాముకు 5.74 వాట్‌ ఉందని తెలిపింది. యూరోపియన్‌ యూనియన్‌ స్టాండర్డ్‌ కిలోగ్రాముకు 4 వాట్‌ కంటే ఇది చాలా అధికమని ఏఎన్‌ఎఫ్‌ఆర్‌ పేర్కొంది. ఇప్పటికే అమ్ముడుపోయిన ఫోన్లలో ఈ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని యాపిల్‌ కంపెనీని ఆదేశించింది. లేదంటే వాటిని కూడా రీకాల్‌ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. దీనిపై రెండు వారాల్లోగా స్పందించాలని తెలిపింది. కాగా, ఈ ఆరోపణలను యాపిల్‌ కంపెనీ ఖండించింది. తమ ఉత్పత్తి ప్రపంచ దేశాల ప్రమాణాల ప్రకారమే ఉందని తెలిపింది. వివిధ దేశాలు, ప్రయివేటు ల్యాబ్‌ల ప్రమాణాలను అందుకున్నట్టు చూపించే నివేదికలను ఏఎన్‌ఎఫ్‌ఆర్‌కు సమర్పించామని పేర్కొంది. ఈ విషయం గురించి ఏఎన్‌ఎఫ్‌ఆర్‌తో చర్చిస్తున్నామని యాపిల్‌ కంపెనీ తెలిపింది.

Spread the love