‘వ్యంగ్యాన్నీ’ వదలరా?

మన సామాజిక జీవితంలో వ్యంగ్యం అనేది ఓ స్ఫూర్తిదాయకమైన ఉపకరణం. వాక్‌ స్వాతంత్య్రానికి ప్రతీకగా నిలిచే ఒక ప్రజాస్వామిక హక్కు.ఇది ప్రభుత్వాలు, పాలకుల తీరును విమర్శించడానికి ప్రజలకు అవకాశం కల్పించే శక్తివంతమైన సాధనం. ప్రత్యేకించి మన కళా సాహిత్య ప్రక్రియల్లో ఓ అద్భుతమైన వ్యక్తీకరణ. అందుకే అనాదిగా జన సామాన్యంలో వ్యంగ్యానికి ఎనలేని ఆదరణ. కానీ వర్తమానంలో మన రాజకీయ నాయకులు మాత్రం వ్యంగాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే కునాల్‌ కమ్రాపై అసహనంతో బుసలు కొడుతున్నారు. ఈ దేశంలో భిన్నాభిప్రాయాలపై అణచివేతకు ఇదో తాజా ఉదాహరణ.
కునాల్‌ కమ్రా, తన దైన శైలితో సమకాలీన రాజకీయాలను విమర్శించే ప్రఖ్యాత స్టాండ్‌-అప్‌ కమెడియన్‌. ముంబైలోని హ్యాబిటాట్‌ కామెడీక్లబ్‌లో ఇటీవల జరిగిన ఒక ప్రదర్శనలో ఈ స్టాండ్‌-అప్‌ కమెడియన్‌ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన షిండేపై ”గద్దార్‌” (ద్రోహి) అన్న పదాన్ని ఉపయోగించి, 2022లో జరిగిన రాజకీయ పరిణామాలపై సెటైర్‌ వేశారు. ఇది తీవ్రమైన వివాదానికి, ఏలినవారి అసహనానానికీ దారితీయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కమ్రా వ్యాఖ్యలు ప్రధానంగా ఏక్‌నాథ్‌ షిండే నాయకత్వంలోని శివసేన విభజనను ప్రస్తావించాయి. 2022లో షిండే శివసేనను చీల్చి బీజేపీతో జతకట్టి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ రాజకీయ పరిణామాన్ని వివరిస్తూ కమ్రా చేసిన కామెడీ సెటైర్‌ షిండే అనుచరులకు ఆగ్రహానికి కారణమైంది. అరాచకం మొదలైంది. ప్రదర్శనా వేదికైన హ్యాబిటాట్‌ క్లబ్‌పై దాడులకు పూనుకున్నారు. కమ్రాపై తీవ్రమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఓ భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. కమ్రా వ్యాఖ్యలు వారికి అభ్యంతకరమైతే ఖండించవచ్చు. నిరసన తెలుపొచ్చు. తిరిగి విమర్శలు చేయొచ్చు. ఆ వ్యాఖ్యలను ఓ రాజకీయ అభిప్రాయంగానే చూడాలి గానీ… ఇలా విధ్వంసాలకు దిగజారడం సమంజసమా? కేవలం వ్యాఖ్యలకే భయపడి, ఓ కామెడీ క్లబ్‌పై దాడికి పూనుకోవడం, వ్యాపార సంస్థలపై ప్రతీకారానికి పాల్పడటం, ప్రాణహాని బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య విలువలను ప్రశ్నించే చర్యలు.
వ్యంగ్యం, హాస్యం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుతమైన భావప్రకటనా సాధనాలు. పొలిటికల్‌ సెటైర్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఓ కళాత్మకమైన అభివ్యక్తిలో విడదీయలేని భాగం. ప్రత్యేకించి కామెడీ షోల్లో సర్వసాధారణం. దీనికి రాజకీయ నాయకులేమీ అతీతులు కారు. అయితే, ఇందుకు భిన్నంగా భారతదేశంలో మాత్రం ఇది తరచూ రాజకీయ పార్టీల, నాయకుల ఆగ్రహానికి గురవుతోంది. ప్రస్తుత సందర్భం దానికి ఓ కొనసాగింపు. షిండే, అయన అనుచరుల తీరే కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తీరు కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగిస్తోంది. కునాల్‌ కమ్రా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేయడం వెనుక ఉద్దేశమేమిటి? ఇది పరోక్షంగా శివసేన అనుచరుల హింసాత్మక చర్యలను సమర్థించడమే కదా? ఇది చాలదన్నట్టు ఒకవైపు ముంబై పోలీసులు, భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్‌) ప్రకారం, సామాజిక విభేదాలను రెచ్చగొట్టడం, ప్రజా గందరగోళం కలిగించడం, పరువునష్టం వంటి అభియోగాలపై కామ్రాపై కేసులు నమోదు చేశారు. మరోవైపు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బిఎంసి) అధికారులు ‘హాబిటాట్‌’ వద్ద అక్రమ నిర్మాణాలను హఠాత్తుగా గుర్తించి వాటిని కూల్చివేశారు. ఓ స్టాండ్‌-అప్‌ కామెడియన్‌పై ఇంతటి రాజకీయ ఒత్తిడి పెంచడం, ఒక హాస్యనటుడిని ఇన్ని రాజకీయ సవాళ్లకు గురి చేయడం..ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? పెచ్చరిల్లుతున్న అసహనాన్నే కదా? అభిప్రాయాలపై అణచివేతనే కదా? ఈ వివాదంపై మీడియా సంస్థల మౌనం సైతం మీడియా స్వేచ్ఛపై ఉన్న ఒత్తిళ్లను బహిరంగంగా ఎత్తిచూపుతోంది.
ప్రజాస్వామ్యంలో విమర్శలు అత్యంత విలువైనవి. విమర్శను అణచి వేయచూడటం, భౌతిక దాడులకు తెగబడటం ఆ విలువలకు వ్యతిరేకమైనవి. ఒక నాయకుడిపై సెటైర్‌ వేసే హక్కు కూడా లేకపోతే, ఇక ఆ ప్రజాస్వామ్యంలో ఎలాంటి స్వేచ్ఛ ఉన్నట్టు? వ్యంగ్యాన్ని కూడా భరించలేని రాజకీయ నాయకులు ఆ ప్రజాస్వామ్యాన్ని ఎలా గౌరవిస్తున్న ట్టు? కమ్రా ఘటన కలిగించిన అలజడి నుంచి ఉత్పన్నమ వుతున్న ప్రశ్నలివి. కమ్రా ఉదంతం మనకు ఇచ్చే పాఠం ఏమిటంటే, అభిప్రాయాలను అణచివేయడం వలన ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుంది. రాజకీయ నాయకులు ప్రజల నుంచి విమర్శలను స్వీకరించలేని స్థితికి చేరుకుంటే, అది నియంతృత్వానికి దారితీస్తుంది. కేవలం అధికారానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు కళాకారులను, రచయితలను, వ్యంగ్యకారులను భయపెట్టడమంటే అది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో, నాయకులు ప్రజల నుండి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ సహనం దేశంలో కొరవడుతోంది. విమర్శలను స్వీకరించగలిగే సంస్కృతి నశిస్తే, భారత రాజకీయాలు అసహనం, అణచివేతలమయం కావడానికి ఎంతో సమయం పట్టదు.

Spread the love