– ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఎర్రజెండా చూస్తూ ఊరుకోదు
– సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా మహాసభల ముగింపులో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సూర్యాపేట
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ప్రజలకు స్వేచ్ఛ ఇస్తానని చెప్పిన ఏడో గ్యారంటీని వెంటనే అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌హాల్ (మల్లు స్వరాజ్యంనగర్, ఉప్పలకాంతారెడ్డి ప్రాంగణంలో)లో జరుగుతున్న సూర్యాపేట జిల్లా మహాసభలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో స్వేచ్ఛ ఉంటుందని, సచివాలయానికి, ప్రజా భవన్‌కు ఉన్న గేట్లను తొలగించానని చెప్పినప్పటికీ ఆచరణలో అమలు కాలేదని, పైగా కేసీఆర్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే అవలంబిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అక్రమంగా అరెస్టు చేస్తూ వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు మాత్రం పూర్తిగా అమల్లోకి రాలేదని ఆరోపించారు. రైతాంగానికి రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి రూ.12,000, మహిళలకు రూ.2500, పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సహాయం వంటి హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. హామీల అమలుకు బలమైన పోరాటాలు నిర్మిస్తామని హెచ్చరించారు.
అనంతరం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెడుతున్నదని విమర్శించారు. అంబానీ, అదానీలకు రాయితీలు ఇస్తూ పేదలపై అనేక భారాలు మోపుతున్నారని అన్నారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ దేశంలో మతాలు, కులాల మధ్యన చిచ్చుపెడుతూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదని విమర్శించారు. ప్రజలపై ధరల భారం పెరిగిందన్నారు. మహిళలపై జరుగుతున్న హత్యలు, లైంగిక వేధింపులను నివారించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన తిండి లేక మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్య, వైద్యం ఉచితంగా అందించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేంత వరకు ప్రజా పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఎర్రజెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ మహాసభల్లో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మీ, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోలిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టిపల్లి సైదులు, నాగారపు పాండు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ పిట్టల రవి, తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.