పేదల పక్షమా..వ్యాపారుల పక్షమా..?

Is it the side of the poor..is it the side of the traders..?– ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తేల్చుకోవాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ పట్టణంలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌ నాయక్‌ పేదల పక్షమా.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల పక్షమో.. తేల్చుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గుడిసెవాసులు ఇండ్ల స్థలాలు, పట్టాల కోసం చేస్తున్న పోరాట దీక్ష సోమవారం మూడో రోజూ కొనసాగింది. ఈ శిబిరాన్ని పట్టణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీజీ నరసింహారావు, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు జి.రాములుతో కలిసి నాగయ్య సందర్శించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి భాను సీతారాం నాయక్‌ అధ్యక్షతన జరిగిన సభలో నాగయ్య మాట్లాడారు. ఇండ్ల స్థలాల కోసం పోరాడుతున్న పేదలపై కర్కషంగా వ్యవహరిస్తూ వారి గుడిసెలు కూల్చివేస్తూ లాఠీచార్జీ చేయించి అమానుషంగా పదిమంది మహిళలపై కేసులు పెట్టి జైలుకు  పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేండ్లుగా పేదలకు ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇస్తామని చెబుతూ మభ్యపెడుతోందని ఆరోపించారు. విసిగి వేశారిన పేదలు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమై పట్టణంలో ఎనిమిది మంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు ఆక్రమించుకున్న భూములను వెలికి తీసి ప్రభుత్వానికి అప్పగించారన్నారు. ఆ భూముల్లో పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు. కాగా, ప్రభుత్వానికి అప్పగించిన భూములను పేదలకు పంచకుండా కుల సంఘాల భవనాల నిర్మాణానికి ఇవ్వడం దారుణమన్నారు. ఇండ్లస్థలాల కోసం పోరాడుతున్న పేదల గుడిసెలపై ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ 14 సార్లు పోలీసు అధికారులతో దాడులు చేయించి కూల్చి వేయించారని, 232 మందిపై కేసులు నమోదు చేయించారని, పదిమంది మహిళలను జైలుకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే భూమి హక్కు పత్రాలు ఇచ్చి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని కూల్చి వేయడం ఖాయమని హెచ్చరించారు. అనంతరం డీజీ నరసింహారావు, జి.రాములు మాట్లాడుతూ.. ప్రజలకిచ్చిన హామీలు అమలుపరిచేందుకు ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో ముందుకు రావాలని, భూ కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మీ పోరాటానికి ఎర్రజెండా అండగా ఉంటుందని ధైర్యాన్నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు సమ్మెట రాజమౌళి, కుర్ర మహేష్‌, పట్టణ కమిటీ సభ్యులు చీపిరి యాకయ్య, తోట శ్రీనివాస్‌, కుమ్మరికుంట్ల నాగన్న, ఎండి తజ్జు, భానోత్‌ వెంకన్న, మచ్చ వెంకన్న, పీఎన్‌ఎమ్‌ జిల్లా కన్వీనర్‌ నక్క సైదులు, మూడవరోజు దీక్షలో బండోజు సునీత, రమ, సుజాత, ఇందిరా, సురేష్‌, వెంకన్న, భద్రయ్య, విఠల్‌, వేణు, ఉమా, చరణ్‌ పాల్గొన్నారు.

Spread the love