భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను గొడ్డలితో నరికిన అల్లుడు

– అత్త పరిస్థితి విషమం.. పోలీసుల అదుపులో అల్లుడు
నవతెలంగాణ – మోత్కూరు: భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు అత్తపై గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాగిబావి గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… రాగిబావి గ్రామానికి చెందిన జక్కుల పెంటయ్య, పిచ్చమ్మలకు ఒక కొడుకు, ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు వరమ్మను రామన్నపేట మండలం ఎన్నారం గ్రామానికి చెందిన నూక రమేష్ కు ఇచ్చి సుమారు 12 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వారికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కాగా రమేష్ బతుకుదెరువు కోసం భార్యాపిల్లలతో హైదరాబాద్ లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో సుమారు 20 రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగి రమేష్ భార్య వరమ్మను కొట్టాడు. దీంతో వరమ్మ తల్లిగారి ఊరు రాగిబావికి వచ్చింది. పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో పెద్ద మనుషులు భార్యాభర్తలిద్దరికి సర్దిచెప్పి నాలుగైదు రోజులు పోయాక వరమ్మ హైదరాబాద్ వస్తుందని చెప్పడంతో రమేష్ వెళ్లిపోయాడు. భార్య తిరిగి రాకపోవడంతో అత్త పిచ్చమ్మనే తన భార్యను పంపడం లేదని అల్లుడు రమేష్ మంగళవారం అర్ధరాత్రి మద్యం సేవించి గ్రామానికి వచ్చాడు. మంచంలో నిద్రిస్తున్న అత్త పిచ్చమ్మపై గొడ్డలితో దాడి చేసి తలపై నరికాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు మేల్కొనడంతో రమేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పిచ్చమ్మను కుటుంబ సభ్యులు చికిత్స కోసం 108లో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్ మేడిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అపస్మారకస్థితిలో ఉన్న ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చి గ్రామంలో రమేష్ కోసం గాలించగా ఓ ఇంటి వద్ద దాక్కున్న అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మోత్కూరు ఎస్ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలాన్ని సందర్శించి నిందితుడు రమేష్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలిసింది.
Spread the love