ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత…

Temperaturesన‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
ఏపీలో సూర్యుడు భగభగమంటన్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాటితో పాటు వడగాలుల తీవ్రత ఉద్ధృతమవుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో పలు చోట్ల ఉష్ణోగ్రతుల 45 డిగ్రీలు దాటాయి. మంగళవారం రోజున 88 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 45.4, విజయనగరం జిల్లా తుమ్మికపల్లిలో 45.2, అనకాపల్లి జిల్లా రావికమతంలో 45.1, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న నాలుగు రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, ఎన్టీఆర్‌, పల్నాడు, నంద్యాల తదితర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశమున్నట్లు వెల్లడించారు. ఈరోజు బుధవారం 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని సూచించింది.

Spread the love