అమ్మ పొద్దున్నే
అంట్లతో ఒక పద్యం రాస్తుంది
ఎంత తళతళలాడుతుందో
చీపురుతోనూ ఒక పాటను శతి చేస్తుంది
ఉదయాన్నే వాకిలి నిండా
ఎంత కమ్మని రాగం ప్రవహిస్తుందో
అమ్మ ఆరుబయట
అంట్లతో పద్యం రాసినప్పుడల్లా
వాన నేను తోడుంటానని వస్తుంది
అంట్లు కడగటంలో తనూ
సాయం చేస్తానని కాబోలు
పాపం వానకేం తెలుసు
తన చినుకుల్లో అమ్మా తడిసిపోతుందని
అందుకే గొడుగు పడతాను నేను
నిజానికి అమ్మ ప్రేమకు
ఏ గొడుగు పట్టగలం
అది జల జలా కురుస్తూ
ఇంటిల్లిపాదినీ తడిపేసే జడివాన
మా అమ్మ నీడపట్టున కూర్చుని
పెరిగి అలంకరించుకున్న
గోళ్ల మెరుపు చూసుకునే అమ్మకాదు
అంట్లు తోమీ తోమీ
అరిగిన మొండి వేళ్లల్లో
పిల్లల భవిష్యత్తును కలగనే అమ్మ
పదిండ్లు తిరిగి పాసిపని చేసైనా
పిల్లల్ని పనిమంతుల్ని
చేయాలనే సంకల్పం
మా అమ్మ కళ్లల్లోనే చూడాలి
అంట్ల పద్యంతో
అందరి ఇళ్లూ మెరిపించే
మా అమ్మ కష్టానికి
ఈ మాత్రం ప్రేమ గొడుగుపట్టటం
కొడుకుగా నా బాధ్యత
చిత్తలూరి
జీవన వేదం
అలల తాకిడికి అలిసిపోయిన
ఇసుక తిన్నెలు..
కన్నీటి ఉప్పెనలో మునిగిపోయిన
తీరపు కలలు!
అనంతమైన నీలి సంద్రంలో!..
అంతుచిక్కని ఎన్ని కడగండ్ల అలలు!
వేటకెళ్లిన పడవ తీరం దాటిన ప్రాణం
తిరిగి చేరుతుందో తెలియదు..
ఉప్పొంగే సముద్రం ముందు —
మనిషి బ్రతుకు ఎంత అల్పం?
గుండె చప్పుడు –ఆ హోరులో ఒక భాగం.
కడలి అంటే కేవలం నీటి రాశి కాదు,
తరతరాల కన్నీటి సాగరం..
ప్రతి కెరటం ఒక నిట్టూర్పు,
ప్రతి సుడిగుండం ఒక ఆవేదన!
సామాన్యుడి బ్రతుకు చిన్ని దోనె!
పైపైన కనిపించే అలల నురుగులే
అబద్ధపు సిరిసంపదలు,
లోలోపల దాగున్న సుడిగుండాలే
పేదవాడి ఆకలి కేకలు!
కోట్లు దిగమింగే తిమింగలాలు ఒకవైపు,
బతుకు భారంతో కొట్టుమిట్టాడే
చేపలు మరొకవైపు..
న్యాయం అనే తీరం
ఎంతో దూరంలో వెక్కిరిస్తుంటే,
అన్యాయపు ఆటుపోట్లలో
మానవత్వం మునిగిపోతోంది!
శ్రమ చిందించే వాడికి కన్నీళ్లే మిగిలాయి,
అధికారపు గాలానికి
సామాన్యులే బలి అవుతున్నారు..
వ్యవస్థ హోరులో ఆక్రందనలు వినిపించవు,
అణగారిన వర్గాల గోడు ‘కడలి’కి పట్టదు!
స్వార్థపు ఉప్పెనలు విరుచుకుపడుతుంటే,
నైతికత నడిసముద్రంలో
నావలా తూలుతోంది..
కష్టాల కడలిని ఈదే ధైర్యం కావాలి,
కడగండ్ల చీకటిని చీల్చే సూర్యుడు రావాలి..
తీరం చేరేదాకా ఆగని ప్రయాణం.
పోరాటమే కదా అసలైన జీవన వేదం!
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి,
8008 577 834
యుద్ధ నేత్రం
ఆడుకునే పిల్లల కన్నుల్లో
ఇసుక జల్లి పోయింది యుద్ధం
ఇక ఆ స్కూల్ బ్యాగ్
ఎప్పటికి స్కూల్ ను చూడదు
ఇక ఆ బ్యాగ్ ను ఏ చేతులు
తెరవలేవు
సగం తాగిన ఆ నీళ్ల బాటిల్ ను
ఏ గొంతు అడగదు
ఆ లేత అక్షరాలను
ఏ కళ్ళు చదవలేవు
ఏ మాస్టర్లు ఆ నోటు బుక్ ను
దిద్దలేరు
నేస్తాలు కరచాలనం చేయడానికి
ఆ చేతులిప్పుడు ముందుకు రావు
ప్లే గ్రౌండ్ లో జిగ్సా
ఒంటరిగా ఊగుతోంది
ఒక పూలగుచ్చాన్ని
సమాధిపై పెడతారంతే
చిదిమేసిన ఆ పసి కలల్ని
ఎవరూ అతికించలేరు
డ్రోన్ల నుండి చిలుకుతున్నది
పన్నీటి జల్లులు కాదు
రక్తపు చుక్కలు
పసిపిల్లల్ని వదలని సైతాను
సన్నజాజి మొగ్గల్ని
రక్తపు కూజాలో వేస్తున్నాడు
పసిపిల్ల ప్రాణాలు
తెగిపోతున్న పతంగుల్లా
గాలిలో తేలిపోతున్నాయి
తూటాలకు పావురాలు
రాలిపడుతున్నాయి
యుద్ధపిపాసి నీకెన్ని ప్రాణాలు కావాలి?
నీ విలాసాలకెంత చమురు కావాలి
దేనిని దేనితో కొలుస్తావు
ప్రాణాలను తూటాలతోనా?
చమురు చుక్కలను
రక్తపు బొట్లతోనా?
- డా.సుంకర రమేశ్, 9492180764



