Tuesday, June 30, 2026
E-PAPER
Homeజాతీయం‘ఆకలి’ పై ఓటు కత్తి!

‘ఆకలి’ పై ఓటు కత్తి!

- Advertisement -

ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగితే
రేషన్‌, సంక్షేమ పథకాలకు గుడ్‌బై?
‘సర్‌’ తొలగింపులను సంక్షేమ పథకాలతో
అనుసంధానించడంపై అనేక సందేహాలు
పౌరసత్వం తేల్చకుండానే హక్కులు ఎలా కట్‌ చేస్తారు?
రాజ్యాంగ నిపుణులు, విశ్లేషకుల ప్రశ్నలు
పశ్చిమ బెంగాల్‌‌లో బీజేపీ సర్కారుపై విమర్శలు

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ చర్చలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) పేరుతో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన లక్షలాది మంది పేర్లను ఆధారంగా తీసుకుని రేషన్‌, మహిళల నగదు సహాయం వంటి సంక్షేమ పథకాలను నిలిపివేస్తామనడంపై అక్కడి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడమంటే ఒక వ్యక్తి పౌరసత్వం కోల్పోయినట్టు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఓటర్ల జాబితాతో అనుసంధానించడం చట్టబద్ధం కాదనే అభిప్రాయాన్ని రాజ్యాంగ నిపుణులు, విశ్లేషకులు చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్‌‌లో ‘డబుల్‌ ఇంజిన్‌’ సర్కారు వైఖరిని తప్పుబడుతున్నారు.

​అసలు వివాదం ఏమిటి?
జూన్‌ 23న పశ్చిమ బంగా ఖేత్‌ మజూర్‌ సమితి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పశ్చిమ బెంగాల్‌లో సర్‌ తొలగింపులను రేషన్‌ కార్డులతో అనుసంధానించడం వల్ల 35 లక్షల నుంచి 60 లక్షల మంది వరకు రేషన్‌ కార్డులు నిలిచిపోయే ప్రమాదం ఉంద ని పిటిషన్‌లో పేర్కొంది. అయితే అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించి, ముందుగా కలకత్తా హై కోర్టును ఆశ్రయించాలని సూచించింది.

మహిళల పథకానికి కూడా సర్‌ షరతు
రాష్ట్ర ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తన విభజన రాజకీయాలను మొదలు పెట్టింది. మమత నేతృత్వంలోని గత తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నడిచిన ‘లక్ష్మీ భండార్‌’ స్థానంలో ‘అన్నపూర్ణ యోజన’ను ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద మహిళ లకు గతంలో ఇచ్చిన రూ.1,500 స్థానంలో రూ.3,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ఒక కీలక నిబంధన చేర్చింది. సర్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన మహిళలు ఈ పథకానికి అర్హులు కాదని స్పష్టం చేసింది. దీంతో ఈ నిర్ణయం ప్రజలలో తీవ్ర ఆందోళనలకు కారణమైంది. ​

రేషన్‌కూ ఓటరు జాబితా తప్పనిసరి
జూన్‌ 4న రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. దాని ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా రేషన్‌ పొందాలంటే ఓటర్ల జాబితాలో పేరు తప్పనిసరిగా ఉండాలి. దీంతో సర్‌ ‌ద్వారా ప్రభా వితమైన ప్రజలకు ప్రభుత్వ ఉత్వర్వు ఆందోళనకు గురి చేసింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 8.89 కోట్ల మందికి పైగా మంది పీడీఎస్‌ లబ్ధిదారులు ఉన్నారు. కాగా సర్‌ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌ చేసినవారు, పౌరసత్వ సవరణ చట్టం (‌సీఏఏ) కింద దరఖాస్తు చేసినవారి కేసులు తేలే వరకు సంక్షేమ పథకాల ప్రయోజ నాలు కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.

రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే..
ఈ చర్యపై ప్రధాన అభ్యంతరం ఏమిటంటే… ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడం అంటే పౌరసత్వం రద్దు కావడం కాదని సుప్రీంకోర్టే ఇప్పటికే స్పష్టం చేసింది. బీహార్‌ సర్‌ కేసులో కోర్టు కీలకంగా పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. సర్‌ ద్వారా పౌరసత్వం నిర్ణయించబడదు. పేరు తొలగించిన వారిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌(ఈసీ)కు లేదు. అలాంటి కేసులను పౌరసత్వ చట్టం-1955 ప్రకారం సంబంధిత అధికారులకు పంపాలని కోర్టు ఆదేశించింది. అంటే ఇప్పటి వరకు ఏ నిబంధన, అధికారిక ఉత్వర్వులు వంటివి కూడా వీరు భారత పౌరులు కాదని ప్రకటించలేదు. అలాంటి పరిస్థితిలో సంక్షేమ పథకాలను నిలిపివేయడం రాజ్యాంగ పరంగా సందేహాస్పదమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా సర్‌లో పేరు తొలగించిన వారిలో… ఎంతమంది అప్పీల్‌ చేశారు? ఎంతమందికి కారణాలు చెప్పలేదు? ఎంతమందికి తొలగింపు సమాచారం కూడా అందలేదు? అనే అంశాలపై ప్రభుత్వ దగ్గర స్పష్టమైన సమాచారం లేకపోవడం గమనార్హం.

‘ఇది ప్రజలను భయపెట్టే చర్య’
మద్రాస్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కె. చంద్రు మాట్లాడుతూ… ఇప్పటికీ తొలగించిన వ్యక్తులకు ఎందుకు పేరు తొలగించారో చెప్పలేదనీ, సరైన కారణాలు కూడా తెలియజేయలేదని చెప్పారు. ఇది ప్రజలను భయపెట్టే చర్యగా ఆయన అభివర్ణించారు. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడానికి పౌరసత్వమే ఒక్క కారణం కాదనీ, ఇంకా అనేక పరిపాలనా సంబంధ కారణాలు కూడా ఉండొచ్చని చెప్పారు. అందువల్ల సంక్షేమ పథకాలను నిలిపివేస్తే… ఎవరైనా హైకోర్టులో, సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద జీవించే హక్కులో భాగంగానే ఆహార హక్కును సుప్రీంకోర్టు పలుమార్లు గుర్తించిందని తెలిపారు. పార్లమెంట్‌కు ఎక్కడ పౌరసత్వాన్ని అర్హతగా పెట్టాలో బాగా తెలుసనీ, పలు చట్టాల్లో వలస కార్మికులకు రేషన్‌, వైద్యం, నివాసం వంటి హక్కులు కల్పించినప్పటికీ పౌరసత్వాన్ని ఎక్కడా షరతుగా పెట్టలేదని గుర్తు చేశారు. చట్టసభ ఉద్దేశపూర్వకంగానే సంక్షేమ హక్కులను పౌరసత్వంతో అనుసంధానం చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

‘సంక్ష‍ేమ పథకాలకు పౌరసత్వం అర్హత కాదు’
మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ.పీ. రావత్ ఈ విషయంలో తన కీలక అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పౌరసత్వం అర్హత కాదని చెప్పారు. జనధన్‌ బ్యాంకు ఖాతాలు, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఉపాధి హామీ, ఇతర సామాజిక సంక్షేమ పథకాలను ఉదాహరణలుగా చెప్పారు. వీటిని ఓటర్ల జాబితా ఆధారంగా నిరాకరించలేమన్నారు. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఎన్నికల కమిషన్‌‌ది కాదని, అది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే ఉంటుందని చెప్పారు. కాగా అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రాటిక్‌ ‌రీఫార్మ్స్‌ ‌వర్సెస్‌ ఎలక్ష‍న్‌ ‌కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (2026) కేసులో సుప్రీంకోర్టు ఒక స్పష్టతనిచ్చింది. సర్‌ కారణంగా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన వ్యక్తి భారత పౌరసత్వాన్ని కోల్పోడని వివరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -