Tuesday, June 30, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునిర్బంధాలు, అరెస్టులను ఛేదించుకుని.. ఎస్‌ఎఫ్‌ఐ లోక్‌‌భవన్‌ ముట్టడి

నిర్బంధాలు, అరెస్టులను ఛేదించుకుని.. ఎస్‌ఎఫ్‌ఐ లోక్‌‌భవన్‌ ముట్టడి

- Advertisement -

సోమాజిగూడ పరిసరాల్లో హైటెన్షన్‌
ఎక్కడికక్కడ ఎస్‌ఎఫ్‌ఐ నేతల ముందస్తు అరెస్టులు
లీకేజీ చేసినోళ్లు దేశభక్తులా…
ప్రశ్నించేటోళ్లు దేశద్రోహులా?
రాష్ట్రంలో బీజేపీ పాలన ఉన్నట్టుంది : ఎస్‌ఎఫ్‌ఐ నేతలు
నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

నీట్‌ ‌పరీక్ష‍ పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ‌రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన చలో లోక్‌‌భవన్‌ ‌తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ చేపట్టిన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర సర్కారు నిర్బంధాలు ప్రయోగించినా… ఎస్‌ఎఫ్‌ఐ నేతలను ఎక్కడికక్కడ ముందస్తుగానే అరెస్టు చేసినా…నిర్బంధాలు, అరెస్టులను ఛేదించుకుని మరీ విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నేతలు లోక్‌‌భవన్‌ ‌సమీపంలోకి దూసుకెళ్లారు. పరుగులు తీసిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైల్వే క్రాసింగ్‌ ‌నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన పలువురు విద్యార్థులను పోలీసులు బారీకేడ్లు పెట్టి అడ్డుకున్నారు. అయినా, ముందుకెళ్లే ప్రయత్నంలో నలుగురైదుగురు పోలీసులు ఒక్కొక్కరిని బలవంతంగా లాక్కెళ్లి వాహనాల్లో పడేశారు. రోడ్డుపై బైటాయించేందుకు యత్నించిన ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు, గర్ల్స్‌‌కమిటీ ‌రాష్ట్ర కన్వీనర్‌ ఎం.మమతను మహిళా పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇటు పోలీసులు, అటు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల ఉరుకులు, పరుగులతో సోమాజిగూడ పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు చేసిన వారిని పలు పోలీస్‌‌స్టేషన్లకు తరలించారు. ముట్టడిలో ఎం.మమత, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, రాష్ట్ర కమిటీ సభ్యులు కార్తీక్, అవినాష్, అరవింద్, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, తరంగ్, నాగేందర్, అరుణ్, సుబ్బు, సాయి, శ్యామ్, కావ్య తదితరులు పాల్గొన్నారు. లోక్ భవన్ సమీపంలో ఎస్‌ఎఫ్‌‌ఐ ఆలిండియా సహాయ కార్యదర్శి ఎం. డి అతిక్ అహ్మద్, రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్ మాట్లాడుతూ దేశంలో నీట్ పేపర్ లీక్ అయ్యి లక్ష‍లాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారనీ, ఇటు సమయం, అటు లక్ష‍లాది రూపాయల డబ్బులు వృథా అయ్యాయని తెలిపారు. నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీతో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని వాపోయారు. విద్యార్థులు చనిపోతున్నా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ‌బాధ్యతారాహిత్యంగా వహిస్తున్నారని విమర్శించారు. ఆయన తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీబీఎస్‌‌సీ వాల్యుయేషన్ లో అవకతవకలు, 80 ప్రవేశ పరీక్షలు లీకైనా కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవటం దారుణమని విమర్శించారు. పరీక్ష పే, మన్ కీ బాత్ పేరుతో మాట్లాడే ప్రధాని మోడీ ఈ లీక్ లపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.

అర్ధరాత్రి నుంచే ఎస్‌ఎఫ్‌‌ఐ నాయకుల అరెస్టు
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలనీ, ఆత్మహత్య చేసుకున్న 20 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, నీట్ పేపర్ లీక్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చలో లోక్ భవన్ ముట్టడి కార్యక్రమ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచే తెలంగాణ పోలీసులు అరెస్టుల పర్వానికి తెరలేపారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. అశోక్ రెడ్డి, కె. శంకర్, జి. శ్రీకాంత్, ప్రవీణ్ రాష్ట్ర కమిటీ సభ్యులు లెనిన్ గువేరాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాద్, హన్మకొండ, కొత్తగూడెం, నల్లగొండ, సంగారెడ్డి, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, మంచిర్యాల, భువనగిరి, భూపాలపల్లి, ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పలువురి నేతలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వారిని విడుదల చేశారు.

మోడీ సర్కార్‌‌ను ప్రశ్నిస్తుంటే రాష్ట్ర సర్కారు అరెస్టులు చేయించడమేంటి? : 
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
బీజేపీ అసమర్థ పాలనపై పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకులను రాష్ట్రంలోని రేవంత్‌‌రెడ్డి సర్కారు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయించడాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు తప్పుబట్టారు. బీజేపీ కంటే కాంగ్రెస్‌ ‌సర్కారే ఎక్కువగా అడ్డుకున్నట్టు ఉందని, నాయకుల ఇండ్లకు వెళ్లి మరీ శోధించి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ముందస్తు అరెస్టులు, కేసుల ద్వారా ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. కేంద్రంలోని మోడీ సర్కారుకు వత్తాసు పలుకకుండా ధర్మేంద్ర ప్రదాన్‌ ‌రాజీనామా చేయాలని, చనిపోయిన 20 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్‌ ‌చేస్తూ జరుగుతున్న పోరాటంలో కలిసి రావాలని రేవంత్‌‌రెడ్డి సర్కార్‌‌కు సూచించారు.

పంజాగుట్ట పీఎస్‌‌లో నేతలను పరామర్శించిన జాన్‌‌వెస్లీ
అరెస్టయి పంజాగుట్ట పోలీస్‌‌స్టేషన్లలో ఉన్న నాయకులను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సభ్యులు మహేందర్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్‌‌డీ జావేద్, టీపీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొమ్ము విజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా జాన్‌‌వెస్లీ మాట్లాడుతూ.. ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. బీజేపీపై పోరాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ లాంటి విద్యార్థి సంఘాల పట్ల రేవంత్‌‌రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -