గెలుపెవరిది..?

Who is the winner?– నేడే ఓటరు తీర్పు వెల్లడి
– 543 లోక్‌సభ స్థానాలకు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశవ్యాప్తంగా మంగళవారం ఉదయం ఏడు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. దేశంలో ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తొలిదశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరగగా చివరి (ఏడో) దశ పోలింగ్‌ జూన్‌ 1 జరిగింది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకూ .. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటికి సంబంధించిన ఓట్ల లెక్కింపునకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపింది.
చివరి దశ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయా ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఫలితాలనిచ్చాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం ఎక్కడో కొంచెం అపనమ్మకం తోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు ఓటింగ్‌ తగ్గడమూ ఒక కారణంగా ఉంది. ఏడు దశల్లోనూ 2019 ఎన్నికల కంటే ఈసారి తక్కువగా పోలింగ్‌ జరిగింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మొదటి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం, మూడో దశలో 66.68 శాతం, నాలుగో దశలో 69.16 శాతం, ఐదో దశలో 62.2 శాతం, ఆరో దశలో 63.36 శాతం , ఏడో దశలో 61.63 శాతం ఓటింగ్‌ నమోదైంది.
మరోపక్క లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి ఒకరోజు ముందు (సోమవారం) జూన్‌ 3న నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (ఎన్డీఏ) రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. బీహార్‌ ముఖ్యమంత్రి, ఎన్డీఏ మిత్రపక్షం నితీష్‌ కుమార్‌, ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. జేపీ నడ్డా నివాసంలో ఆయన అధ్యక్షతనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా వంటి సీనియర్‌ మంత్రులు, అలాగే ఇతర మంత్రులు, కొంత మంది పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ” ఏడు దశల్లో ఓటింగ్‌ ఎలా జరిగిందనే దానిపై ప్రధానంగా సమీక్షించడంతో పాటు కౌంటింగ్‌ సన్నాహాలను కూడా సమీక్షించాల్సి ఉంది” అని నడ్డా ఇంట్లో జరిగిన సమావేశంపై బీజేపీ సీనియర్‌ ప్రధాన కార్యదర్శి వినోద్‌ తావ్డే చెప్పారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఎం.ఎల్‌. ఖట్టర్‌తో పాటు సీనియర్‌ మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లు సమాచారం. అలాగే చివరి దశ పోలింగ్‌ రోజున (జూన్‌ 1న) ఇండియా ఫోరం సమావేశమైంది. సమావేశానంతరం ఇండియా ఫోరానికి 295కు పైగా స్థానాలు వస్తాయని ప్రకటించారు.

Spread the love