Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందేశానికి కార్మిక, యువశక్తే కీలకం

దేశానికి కార్మిక, యువశక్తే కీలకం

- Advertisement -

వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో వారిదే కీలక పాత్ర 15 కోట్లకు ఈఎస్‌ఐ లబ్దిదారుల సంఖ్య
రామగుండంలో ఈఎస్‌ఐ ఆస్పత్రి పెడతాం : కేంద్ర కార్మిక, క్రీడా, యువజన శాఖ మంత్రి
మన్‌‌సుఖ్‌ మాండవ్య తెలంగాణకు ఈఎస్‌ఐ ఆస్పత్రులను కేటాయించండి
15 డిస్పెన్సరీలకు స్థలాలిస్తాం..
తిరిగి కేటాయించండి : కేంద్ర మంత్రికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి విజ్ఞప్తి
సనత్‌‌నగర్‌ ఈఎస్‌ఐసీ ఆస్పత్రి ఓపిడీతో సహా మరో ఆరు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశానికి కార్మిక, యువశక్తే కీలకమనీ, వికసిత్‌ ‌భారత్‌ ‌నిర్మాణంలో వారిదే కీలక పాత్ర అని కేంద్ర కార్మిక ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖల మంత్రి డాక్టర్ మన్‌సుఖ్‌ మాండవ్య చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌‌లోని సనత్‌నగర్‌లో గల ఈఎస్‌ఐసీ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.211.13 కోట్లతో నిర్మించిన అవుట్‌ పేషెంట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఓపీడీ) భవనాన్ని ప్రారంభించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గల 12.3 లక్షల మందికి పైగా బీమా చందాదారులు, ఇతర లబ్ధిదారులకు విస్తృత సేవలు లభించనున్నాయి. అట్లాగే, శ్రీపెరంబూరులోని వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని, రాజమహేంద్రవరం వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని, అస్సాంలోని బలోటాలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని 200 బెడ్లకు విస్తరణ, గుజరాత్‌‌లోని సురేంద్రనగర్‌ ‌డిస్పెన్సరీ, రాజస్థాన్‌‌లోని కోటా డిస్పెన్సరీని, భవాని మండి డిస్పెన్సరీలను వర్చువల్‌‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మన్‌‌సుక్‌ ‌మాండవ్య మాట్లాడుతూ..ఆధునిక యుగంలో ప్రగతి దిశగా సాంకేతిక పరిజ్ఞానాలు, కృత్రిమ మేధ ప్రధాన కారకాలైనప్పటికీ కార్మికుల ‘శ్రమశక్తి’ కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదన్నారు.

అలాంటి కార్మికులకు గౌరవం, సామాజిక భద్రత కల్పన అత్యావశ్యకమని స్పష్టం చేశారు. పదేండ్ల కింద ఈఎస్‌ఐసీ లబ్ధిదారుల సంఖ్య సుమారు 7.5 కోట్లు కాగా నేడు 15 కోట్లు దాటిందని తెలిపారు. 94 కోట్ల మంది ప్రజలు దీని పరిధిలోకి వచ్చారని వివరించారు. దేశంలో 80 కోట్ల మందికి పైగా పేదలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ చేస్తున్నామన్నారు. కార్మికుల సామాజిక భద్రతకు నాలుగు లేబర్‌‌కోడ్‌‌లు దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. యాజమాన్యాలు తప్పనిసరిగా నియామక పత్రాల జారీ చేయాలనే నిబంధన పెట్టామనీ, 40 ఏండ్లు పైబడిన కార్మికులకు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు, స్త్రీ-పురుషులకు సమాన వేతనం, ఏడాది సేవలు పూర్తిచేసిన వారికీ గ్రాట్యుటీ పొందే అర్హత వంటి అంశాలను ప్రస్తావించారు. పరిశ్రమలు-కార్మిక శక్తి మధ్య స్నేహపూర్వక సబంధాలుండాలని ఆకాంక్షించారు.

​ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి ‌డాక్టర్‌ వివేక్‌ ‌వెంకటస్వామి మాట్లాడుతూ.. ప్రయివేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడం కార్మికులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు మెరుగైన వైద్యసేవలను అందించేందుకు ఈఎస్‌ఐ సేవలను విస్తించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రామగుండం ప్రాంతంలో కార్మికుల సంఖ్య ఎక్కువ కాబట్టి అక్కడ వంద పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి కట్టాలని విన్నవించారు. గతంలో ఆమోదం లభించినప్పటికీ టెండర్ల ప్రక్రియ నిలిచిపోయిందనీ, వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రామగుండం, శంషాబాద్‌, మహబూబ్‌‌నగర్‌‌లో ఈఎస్‌ఐ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సనత్‌‌నగర్‌ ఈఎస్‌ఐ ఆస్పత్రి నేడు ఎంతో పురోగతి సాధించిందని తెలిపారు. పటాన్‌‌చెరు, రామచంద్రాపురం ఏరియాల్లో పరిశ్రమలు ఎక్కువ కాబట్టి అక్కడ ఈఎస్‌ఐ సేవలను విస్తరించాలని కోరారు. రాష్ట్రంలో క్యాన్సిల్‌ ‌చేసిన 15 ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను తిరిగి పునరుద్ధరించాలనీ, వాటికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్థలాలిచ్చి ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్రంలో 20 లక్షల మంది ఐపీలు, 80 లక్షల మంది లబ్దిదారులకు ఈఎస్‌ఐ సేవలు అందుతున్నాయని తెలిపారు.

సనత్‌నగర్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు రామచంద్రాపురం, నాచారం ఆస్పత్రులను అత్యాధునిక వైద్య కేంద్రాలుగా తీర్చిదిద్దాలనీ, రామచంద్రాపురంలో కార్డియాక్ కేర్ సెంటర్‌తో పాటు 20 పడకల డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలనీ, నాచారంలో ఇప్పటికే కార్డియాక్ సెంటర్‌కు ఆమోదం లభించిన నేపథ్యంలో అక్కడ కూడా 20 పడకల డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. విదేశీ ఉపాధి అవకాశాలను కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్ ద్వారా దేశంలోనే ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో నర్సుల కొరత ఉన్న నేపథ్యంలో నాచారం ఈఎస్ఐలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కళాశాల ద్వారా శిక్షణ పొందిన నర్సులు ఈఎస్ఐ ఆస్పత్రులతో పాటు విదేశాల్లో కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. శంషాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిన ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించాలనీ, భవిష్యత్తులో వరంగల్ ప్రాంతంలో కూడా ఈఎస్ఐ ఆస్పత్రి అవసరం ఉంటుందని తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ సేవలు అందుబాటులోకి వస్తే కార్మికులకు, వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎస్‌ఐ డైరెక్టర్‌ ‌జనరల్‌ (ఆపరేషన్‌) ‌డాక్టర్‌ అశోక్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, సనత్‌‌నగర్‌ ఈఎస్‌ఐ కాలేజీ, ఆస్పత్రి డీన్‌ ‌డాక్టర్‌ ఎస్‌.జీ.చవాన్‌, తదితరులు పాల్గొన్నారు. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -