ఎన్జీఓలపై ఉక్కుపాదం తగదు

ఎన్జీఓలపై ఉక్కుపాదం తగదు– క్రూరమైన చట్టాలతో వేధింపులు సరికాదు
– 700 సంస్థలపై ఆధారాలే లేవు
– అంతర్జాతీయ సంస్థ ఎఫ్‌ఏటీఎఫ్‌ నివేదిక
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉక్కుపాదం మోపుతోందని అంతర్జాతీయ సంస్థ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) అభిప్రాయపడింది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం, మనీలాండరింగ్‌ కార్యకలాపాలపై ఈ సంస్థ పరిశీలన జరుపుతోంది. జూన్‌ 23-28 తేదీల మధ్య సింగపూర్‌లో ఎఫ్‌ఏటీఎఫ్‌ ప్లీనరీ సమావేశం జరిగింది. కువైట్‌, భారత్‌లో నెలకొన్న పరిస్థితులపై రూపొందించిన నివేదికలను ఈ సమావేశంలో చర్చించారు. భారత్‌లో స్వచ్ఛంద సంస్థల విషయంలో తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా లేవని అంటూ నేరస్థులను విచారించే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని సమావేశం సూచించింది. ఉగ్రవాదానికి సాయం అందకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అదే సమయంలో ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నాయన్న కారణం చూపి స్వచ్ఛంద సంస్థలను వేధించకూడదని తెలిపింది.
స్వచ్ఛంద సంస్థలను అణచివేసేందుకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) వంటి వాటిని భారత్‌ ప్రయోగిస్తోందని, ఈ వైఖరి తమ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని ఎఫ్‌ఏటీఎఫ్‌ స్పష్టం చేసింది. ప్రమాణాలను సాకుగా చూసి ఎన్‌జీఓలపై విరుచుకుపడడం సరికాదని హితవు పలికింది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎఫ్‌సీఆర్‌ఏను 2020లో మరోసారి సవరించిన విషయం తెలిసిందే. విదేశీ విరాళాలు పొందే ఎన్జీఓలపై నిఘాకు, నియంత్రణకు ఈ సవరణ ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టింది. అదే విధంగా మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం, ఉపాను కూడా మోడీ ప్రభుత్వం సవరించి వాటిని మరింత క్రూరమైన చట్టాలుగా మార్చింది. ఎఫ్‌ఏటీఎఫ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ సవరణలు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్పుకుంది.
ఎఫ్‌సీఆర్‌ఏ కింద నమోదైన పలు ప్రముఖ స్వచ్ఛంద సంస్థల రిజిస్ట్రేషన్లను గత కొన్ని సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం రద్దు చేస్తోంది. దీంతో అవి విదేశీ విరాళాలు పొందే అవకాశం లేకుండా పోయింది. కంపాసన్‌ ఇంటర్నేషనల్‌, గ్రీన్‌పీస్‌, అమ్నెస్టీ, సెంటర్‌ ఫర్‌ పాలసీ రిసెర్చ్‌ వంటి పేరెన్నికగన్న ఎన్‌జీఓల భారతీయ శాఖల రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. చివరికి 2022లో నోబెల్‌ పురస్కార గ్రహీత మదర్‌ థెరిసాకు చెందిన మిషనరీన్‌ ఆఫ్‌ ఛారిటీస్‌ కూడా కొంతకాలం లైసెన్సును కోల్పోయింది. ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రమైన నిరసన వ్యక్తం కావడంతో రెండు వారాల తర్వాత దానిని ప్రభుత్వం పునరుద్ధరించింది.
విదేశీ విరాళాలు పొందేందుకు అనుమతి కోసం ఎన్జీఓలు సమర్పించిన దరఖాస్తుల్లో 2010 నుండి ఇప్పటి వరకూ 56 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయని ఎఫ్‌ఏటీఎఫ్‌ తెలిపింది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్న కొన్ని ఎన్జీఓలను భారత ప్రభుత్వం గుర్తించిందని, అయితే వీటిలో 700 సంస్థల కార్యకలాపాలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని తేల్చింది. ఎన్జీఓలపై గంపగుత్తగా చర్యలు తీసుకోవడం సరికాదని, వాటి కార్యకలాపాలను విడివిడిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని 2014లోనే ఈ అంతర్జాతీయ సంస్థ సూచించింది.

Spread the love