అక్క‌డ‌ నోటాకు రికార్డు ఓట్లు…

Notaన‌వ‌తెలంగాణ – మ‌ధ్య‌ప్ర‌దేశ్‌
సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించిన స్థానాల్లో మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌ ఒకటి. అక్క‌డ‌ కాంగ్రెస్‌ అభ్యర్థి చివరి నిమిషంలో నామినేష‌న్ నుంచి వైదొలగడంతో ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం చాలా తేలిక‌గా మారింది. ఇప్పుడు ఆ స్థానం మరో సంచలనానికి వేదికైంది. దేశంలోనే అత్యధిక మెజార్టీ నమోదైన స్థానంగా నిలవడమే కాకుండా.. నోటాకు అత్యధికంగా ఓట్లు పడిన స్థానంగానూ రికార్డుకెక్కింది. ఇందౌర్‌ లోక్‌సభ స్థానానికి మే 13న పోలింగ్‌ జరిగింది. బీజేపీ నుంచి సిటింగ్‌ ఎంపీ శంకర్‌ లాల్వానీ పోటీ చేయగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌కాంతి బామ్‌ మాత్రం చివరి క్షణంలో (ఏప్రిల్‌ 29న) నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. దాంతో అక్కడ కాంగ్రెస్‌ పోటీలో లేకుండా పోయింది. దీంతో నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేసింది. తద్వారా బీజేపీకు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఊహించినట్లుగానే బీజేపీ అభ్యర్థి శంకర్‌ లాల్వానీ 10 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఆయనకు 12 లక్షల ఓట్లు పోలయ్యాయి. దేశంలో అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అభ్యర్థిగా ఆయన రికార్డులకెక్కారు. ఆయన తర్వాత నోటాకే అత్యధికంగా 2 లక్షలకు పైగా (218674) పోలయ్యాయి. ఓవిధంగా కాంగ్రెస్‌ ప్రచారానికి ఫలితం దక్కినట్లయ్యింది. ఇక్కడ రెండో స్థానంలో ఉన్న బహుజన్‌ సమాజ్‌ పార్టీ అభ్యర్థి సంజయ్‌కు 51 వేల ఓట్లు పోలయ్యాయి. ఆయనకంటే నోటాకు వచ్చిన ఓట్లే దాదాపు లక్షన్నర అధికం కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలో 25.13 లక్షల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల చరిత్రలో బిహార్‌ గోపాల్‌గంజ్‌ స్థానంలో నోటాకు 51వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ రికార్డును ఇందౌర్‌ అధిగమించింది.

Spread the love