అమెరికాది ఆర్థిక ఉగ్రవాదం.. ఆంక్షలపై ఆగ్రహించిన వెనిజులా

నవతెలంగాణ -హైదరాబాద్: తమ దేశంపై ఆంక్షలను విధించడమే కాకుండా వాటిని పొడిగిస్తూ వస్తున్నారంటూ అమెరికాపై వెనిజులా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. వెనిజులాకు వ్యతిరేకంగా 930కి పైగా చర్యలు తీసుకోవడం ద్వారా అమెరికా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్పడుతోందని వెనిజులా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామా నేతృత్వంలో 2015లో జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ 13692ని పొడిగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మంగళవారం నిర్ణయించారు. వెనిజులాలో పరిస్థితికి సంబంధించి మరో ఏడాది పాటు జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాకు అసాధారణమైన ముప్పును వెనిజులా కలిగిస్తోందని అన్నారు. అంతర్జాతీయ చట్టాలకు సంబంధించిన ప్రతి నిబంధనను ఉల్లంఘించి వెనిజులన్లపై ఉధృతంగా సాగిస్తున్న ప్రచారాన్ని సమర్ధించేందుకు ఈ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ను ఉపయోగించుకుంటున్నారని వెనిజులా ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించింది. బలవంతపు చర్యలు, దోపిడీ లేదా అగౌరవంపై ఆధారపడని, సమగ్రమైన విదేశాంగ విధానాన్ని రూపొందించే సామర్ధ్యం అమెరికాకు లేదని విమర్శించింది. అమెరికా ఏం చేసినా దానితో నిమిత్తం లేకుండా వెనిజులా స్వేచ్ఛాయుతమైన దేశంగా కొనసాగుతుందని పేర్కొంది.

Spread the love