‘ఆమె’కు వేధింపులు గతేడాది 28,811 ఫిర్యాదులు

Harassment of 'her' Last year there were 28,811 complaints– 55 శాతం యూపీ నుంచే
– ఎన్సీడబ్ల్యూ సమాచారం
న్యూఢిల్లీ : దేశంలో ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మహిళలపై వేధింపులు, నేరాలు ఆగటం లేదు. ప్రభుత్వాలు సైతం వారికి భద్రత కల్పించటంలో విఫలమవుతున్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి గతేడాది మొత్తం 28 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఇందులో అత్యధికంగా 55 శాతం బీజేపీ పాలిత యూపీ రాష్ట్రం నుంచే కావటం గమనార్హం. జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్సీడబ్ల్యూ) ఈ విషయాన్ని వెల్లడించింది.
పలు వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు
ఎన్సీడబ్ల్యూ సమాచారం ప్రకారం.. గతేడాది మహిళలపై నేరాలకు సంబంధించి 28,811 ఫిర్యాదులు అందాయి. గృహ హింస కాకుండా వేధింపులతో కూడిన గౌరవ హక్కు కేటగిరీలో అత్యధికంగా8,540 ఫిర్యాదులు అందాయి. దీని తర్వాత గృహ హింసపై 6,274 ఫిర్యాదులు వచ్చాయి. వరకట్న వేధింపుల ఫిర్యాదులు 4,797, వేధింపుల ఫిర్యాదులు 2,349, మహిళలపై పోలీసు ఉదాసీనత 1,618, లైంగికదాడి, లైంగికదాడికి ప్రయత్నించిన ఫిర్యాదులు 1,537గా నమోదయ్యాయి. లైంగిక వేధింపులపై 805 ఫిర్యాదులు, సైబర్‌ క్రైమ్‌లపై 605, స్టాకింగ్‌పై 472, గౌరవ నేరాలకు సంబంధించి 409 ఫిర్యాదులు వచ్చాయి.
రాష్ట్రాల వారీగా ఇలా..
యూపీలో అత్యధికంగా 16,109, ఢిల్లీలో 2,411, మహారాష్ట్రలో 1,343 ఫిర్యాదులు నమోదయ్యాయి. బీహార్‌లో 1,312, మధ్యప్రదేశ్‌లో 1,165, హర్యానాలో 1,115, రాజస్థాన్‌లో 1,011, తమిళనాడులో 608, పశ్చిమ బెంగాల్‌లో 569, కర్నాటకలో 501 ఫిర్యాదులందాయి. 2014లో కేంద్రంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన ఫిర్యాదులో 2022లో అత్యధికంగా (30,864) నమోదయ్యాయి.
సామూహిక లైంగికదాడి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్టు
లక్నో : గతేడాది నవంబర్‌లో యూపీలోని వారణాసిలో గల ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ-బనారస్‌ హిందూ యూనివర్శిటీ (ఐఐటీ- బీహెచ్‌యూ) క్యాంపస్‌లో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదుదారు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 1న రాత్రి స్నేహితురాలితో కలిసి హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లారు. మోటార్‌సైకిల్‌పై అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను ఒక నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆ వ్యక్తులు ఆ మహిళను బట్టలు విప్పి ఫోటోలు తీసి వీడియో తీశారు. ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్న 15 నిమిషాల తర్వాత బాధితురాలిని పంపించారు. ఈ ఘటనతో యూనివర్శిటీ విద్యార్థులు నిరసనకు దిగారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. కాగా, అరెస్టయిన ముగ్గురు వ్యక్తులను కునాల్‌ పాండే, సాక్షం పటేల్‌, అభిషేక్‌ చౌహాన్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
కాగా, నిందితులకు బీజేపీతో సంబంధాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ సోషల్‌ మీడియా పోస్ట్‌లో అరెస్టయిన వారు సీనియర్‌ నాయకుల కింద పని చేస్తున్నవారని ఆరోపించారు. ఈ కేసులో బలమైన సాక్ష్యాధారాలు, పెరుగుతున్న ప్రజల ఆగ్రహం కారణంగా యూపీ ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయవలసి వచ్చిందని ఆయన వివరించారు. ”మహిళల గౌరవంతో బీజేపీ ఎలా ఆడుకుంటున్నదో, అఘాయిత్యాలు, వేధింపులు, లైంగికదాడులకు పాల్పడిన వారికి రక్షణ కల్పిస్తున్నదని దేశవ్యాప్తంగా ప్రతి మహిళా చూస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మహిళలు ఒక్క ఓటు కూడా వేయరు. బీజేపీ ఓటమికి మహిళలే కారణమవుతారు” అని అఖిలేశ్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Spread the love