వారంతా తిరిగి జైలుకు వెళ్లాల్సిందే…

They should all go back to jail...– ఆ పదకొండు మందినీ విడుదల చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదు
– బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదలను రద్దుచేసిన సుప్రీంకోర్టు
–  గుజరాత్‌ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరించిందని వ్యాఖ్య
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2002లో గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై లైంగికదాడి చేసి, ఆమె కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో 11 మంది దోషులను ముందస్తుగా విడుదలచేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆ 11 మంది రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దోషుల ముందస్తు విడుదలపై ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్‌ ప్రభుత్వానికి లేదని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది కాబట్టి… అటువంటి విడుదల ఉత్తర్వులు జారీచేసే అర్హత అక్కడి ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ‘దోచుకున్నందుకు’ గుజరాత్‌ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ‘గుజరాత్‌ ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా పనిచేసింది’ అని తీర్పులో స్పష్టంచేసింది. ‘చట్టబద్ధ పాలనను అమలు చేయాల్సిన చోట కరుణ, సానుభూతిలకు చోటుండదు. దానిని పరిరక్షించడం కోర్టు ముఖ్య బాధ్యత’ అని తీర్పు ఇచ్చింది. ‘దోషుల మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అలాంటి పరిస్థితిలో 14 సంవత్సరాలు శిక్ష అనుభవించిన తరువాత వారిని ఎలా విడుదల చేశారు? మరి ఇతర ఖైదీల విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేదు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21 వ తేదీన జీవిత ఖైదు విధించింది. అయితే 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ దోషులకు రెమిషన్‌ మంజూరు చేస్తూ గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, సామాజిక సంఘాలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నేరస్తులను హీరోలుగా చూడడం, వారిని సాదరంగా స్వాగతించడం వంటివి జనాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. దోషుల విడుదల గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బిల్కిస్‌ బానో పేర్కొన్నారు. దోషుల విడుదలను సవాల్‌ చేస్తూ.. తనకు న్యాయం చేయాలని ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో బిల్కిస్‌ బానోతోపాటు, సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, టీఎంసీ నేత మహువా మోయిత్రా, జర్నలిస్ట్‌ రేవతి లాల్‌, లక్నో యూనివర్శిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ రూప్‌ రేఖా వర్మలు పిటిషన్‌ దాఖలుచేశారు. ఈ పిటిషన్లను విచారించిన జస్టిస్‌ బివి నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం అక్టోబర్‌లో తీర్పును రిజర్వ్‌ చేసింది. సోమవారం తీర్పునిచ్చింది.

Spread the love