ఆదివాసి అని అలుసుగా అలుసుగా చూస్తున్నారని చెంచుల ఆవేదన.
చెంచులను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు విస్మరించారు.
నవతెలంగాణ-అచ్చంపేట
అమ్రాబాద్ మండలం నల్లమల్ల అడవి ప్రాంతంలో నివాసం ఉంటున్న చెంచు పెంటలలో త్రాగు నీటి సమస్య నేటికీ తీవ్రంగా ఉంది. చెంచు గూడేలలో విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల కొన్ని చోట్ల సోలార్ తో నడిచే మోటార్లను ఏర్పాటు చేశారు.. కానీ ఎండ ఉంటేనే అవి నడుస్తున్నాయి. ఆకాశం లో మబ్బులు పట్టినప్పుడు, ఉదయం, సాయంత్రం వేళలో సోలార్ పనిచేయడం లేదు. దీంతో దాహం… దాహం అంటూ చెంచులు ఆందోళన చెందుతున్నారు.
ఒక బిందె నీటి కోసం కొన్ని గంటల తరబడి ఎదురుచూస్తున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెంచులను పూర్తిగా విస్మరించారని అధికారులపై మండిపడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లాపూర్ పెంట, సంగడి గుండాల, మేడి మలికల ఇలా 15 చెంచు పెంటలలో రోజు త్రాగు నీటి కోసం చెంచులు అవస్థలు పడుతున్నారు. చెంచుపెంటల్లో తాగునీటి కోసం చెంచుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా.. అడవి బిడ్డల నీటి గోస మాత్రం తీరడం లేదు. ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా చెంచుపెంటలలో పరిస్థితులు ఉన్నాయి.
అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం..
తమ తాగునీటి కష్టాలపై ఎన్నిసార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకుండా పోయిందని చెంచులు ఆరోపిస్తున్నారు. శాశ్వత తాగునీటి సౌకర్యం లేదా నిరంతర విద్యుత్ సరఫరాను కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెంచుపెంటల్లో ప్రత్యామ్నాయ నీటి వసతులు కల్పించి, తమ దాహార్తిని తీర్చాలని నల్లమల చెంచులు డిమాండ్ చేస్తున్నారు.



