Monday, June 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇది తీవ్రమైన క్విడ్‌ ప్రోకో ఆఫర్‌

ఇది తీవ్రమైన క్విడ్‌ ప్రోకో ఆఫర్‌

- Advertisement -

డబ్బుతో న్యాయాన్ని కొనేందుకు బరితెగింపు
అదానీ ప్రతిపాదనపై మండిపడ్డ డెమొక్రాట్‌ సెనెటర్లు
తాత్కాలిక అటార్నీ జనరల్‌కు లేఖ


వాషింగ్టన్‌ : తనపై మోపిన ఆరోపణలను ఉపసంహరించుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో పది బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెడతానంటూ అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ చేసిన ప్రతిపాదనపై డెమొక్రాట్‌ సెనెటర్లు మండిపడ్డారు. ఇది ‘తీవ్రమైన క్విడ్‌ ప్రోకో ఆఫర్‌’ మాదిరిగా కన్పిస్తోందని తాత్కాలిక అటార్నీ జనరల్‌ టాడ్‌ బ్లంచ్‌కి రాసిన లేఖలో డెమొక్రాట్‌ సెనెటర్లు ఎలిజబెత్‌ వారెన్‌, రిచర్డ్‌ బ్లూమెంతల్‌ తెలియజేశారు. అదానీపై మోపిన నేరపూరిత ఆరోపణలను ఉపసంహరిం చుకోవాలంటూ న్యాయస్థానాన్ని అమెరికా న్యాయ శాఖ అభ్యర్థించడం వెనుక ఉన్న ‘లావాదేవీల స్వభావా’న్ని వారు ప్రశ్నించారు. గత నెల 18న న్యాయ శాఖ న్యూయార్క్‌ న్యాయమూర్తికి ఓ విన్నపాన్ని పంపుతూ అదానీపై మోపిన ఆరోపణల విషయంలో తదుపరి చర్యలకు స్వస్తి చెప్పాలని తన విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్నానని తెలియజేసింది. అయితే దీనిపై న్యాయమూర్తి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత న్యాయవాదులలో ఒకరైన రాబర్ట్‌ జే గిఫ్రా జూనియర్‌ నేతృత్వంలోని లీగల్‌ బృందాన్ని గౌతమ్‌ అదానీ నియమించుకున్న నేపథ్యంలో ఆయనపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకోవాలని న్యాయ శాఖ యోచిస్తోందని ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక అంతకుముందు తెలియజేసింది. ‘అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాదులలో ఒకరి సాయంతో అనేక బిలియన్‌ డాలర్ల లంచం కుంభకోణం కేసు నుంచి అదానీ బయటపడ్డారు. అందుకోసం అమరికాలో భారీగా పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చారు’ అని తాత్కాలిక అటార్నీ జనరల్‌కు రాసిన లేఖలో డెమొక్రాట్‌ సెనెటర్లు ఆరోపించారు. తనపై ఉన్న అభియోగాలను ఉపసంహరించుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెడతానంటూ అదానీ చేసిన ప్రతిపాదన ‘శిక్షలో సడలింపులను డబ్బుతో కొనుక్కునేందుకు ఓ ధనవంతుడు చేసిన బరితెగింపు ప్రయత్నం’గా కన్పిస్తోందని మండిపడ్డారు. అదానీపై అభియోగాలను ఉపసంహరించుకోవాలని న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయం అవినీతి ప్రవర్తనలో అది కూడా సమాన భాగస్వామేనన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని అన్నారు.

ఏమిటీ కేసు?
సౌర ఇంధన కాంట్రాక్టు కోసం భారత్‌లోని అధికారులకు లంచాలు ఇవ్వడానికి 265 మిలియన్‌ డాలర్ల మోసపూరిత పథకానికి గౌతమ్‌ అదానీ రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలలో అమెరికా పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణపై గౌతమ్‌ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్‌ అదానీలపై 2024 నవంబరులో అధికారులు అభియోగాలు మోపారు. నిధుల కోసం ముడుపుల సమాచారాన్ని వారు దాచిపెట్టారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. సెక్యూరిటీల మోసం ఆరోపణలపై గౌతమ్‌, సాగర్‌లపై అభియోగాలు మోపారే తప్ప ముడుపుల ఆరోపణలపై కాదని అదానీ గ్రూప్‌ 2024 నవంబరులో స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వివరించింది. కాగా అమెరికా న్యాయ శాఖ క్రిమినల్‌ ఆరోపణలను ఉపసంహరించుకున్నప్పటికీ గౌతమ్‌ అదానీ ఆర్థిక జరిమానాలు చెల్లించే అవకాశం ఉందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -