
– ఉదయం పాఠశాలకు వచ్చి హాజరుపడి తిరుగుముఖం..
– మారుమూల పల్లెనే కదా ఏమవుతాదనే ధీమా
– పాటశాలపై కరువైన పర్యవేక్షణ..
నవతెలంగాణ – కాటారం
పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్..విధులకు డుమ్మా కొట్టడం అలవాటుగా మార్చుకున్నాడు. ఓ వారామో..నెలో కాదండోయ్.. నిరంతరం సారు గారు తీరే అంతా. మారుమూల పల్లె కదా అనే ధైర్యమో.. అధికారులు అండ ఉందనే ధీమానో ఏమో కానీ… విధులకు డుమ్మా కొట్టడం పరిపారిగా మారింది. విద్యార్థులు విద్యావంతులు కావాలి.. ప్రయోజకులు కావాలని నినాదాలు, సందేశాలు, వినేందుకు గొప్పగా ఉంటాయి. వాటి అమలు తీరు, ప్రభుత్వ అధికార యంత్రంగాన్ని వెక్కిరిస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం. ఉపాధ్యాయుల ఉదాసీనత, గ్రామీణ ప్రాంత విద్యార్థుల పాలిట శాపం గా మారింది. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యావ్యవస్థ గాడి తప్పుతుంది. చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు వీధులకు డుమ్మా కొడుతున్నరు. అడిగే వారు లేకపోవడం, పట్టించుకునే అధికారులు ఉండకపోవడంతో పిల్లల చదువులు అగమ్య గోచరంగా మారుతున్నాయి. నస్తురుపల్లి ప్రాథమిక పాఠశాల నిర్వహణపై వ్యాఖ్యలకు ఉదాహరణగా నిలుస్తుంది.
అటెండెన్స్ పడ్డాక అదృశ్యం..
ప్రభుత్వ ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొడుతున్నారనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ సిస్టంలో ఫోటో దిగి ఆన్లైన్లో పంపాలని నిబంధనలు పెట్టింది. అయినప్పటికీ కొందరు ఉపాధ్యాయులు ఉదయం సాయంత్రం సమయంలో పాఠశాలకు హాజరై మిగతా సమయంలో ప్రైవేటు పనులు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. బుధ, గురువారం రెండు రోజులు నిఘా ను నిర్వహించగా ప్రధానోపాధ్యాయిని తతంగం బయటకు వచ్చింది. నస్తురుపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయునితోపాటు మరో ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తున్నారు. పాఠశాలలో 12 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వికలాంగుల కోటలో ఉద్యోగాన్ని సంపాదించిన సదరు ఉపాధ్యాయుడు నెలనెలా ప్రభుత్వం నుండి జీతభత్యాలు పొందుతు గిరిజన విద్యార్థులకు శాపంగా మారాడు. పాఠశాల సమయాల్లోనే ప్రైవేటు పనులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ పాఠశాలలో బాధ్యతలు చేపట్టిన నుండి ప్రతిరోజు ఉదయం 9:30 కు పాఠశాలకు వచ్చి ఆన్లైన్లో ఫోటో పెట్టి 10:30 కు ఇల్లు చేరుతున్నట్లు సాయంత్రం సమయంలో మరోసారి పాఠశాలకు చేరి ఫోటోను ఆన్లైన్ పెడుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.ఒకవేళ వచ్చిన ఆ ప్రధానోపాధ్యాయులు సెల్లు చూసుకుంటూ నిద్రపోతారని కనీసం పాఠాలు కూడా చెప్పరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రధానోపాధ్యాయుల తిరుపట్ల గ్రామస్తులు మండిపడుతున్నారు..
తనిఖీలు మరిచిన విద్యాశాఖ అధికారులు..?
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుండాలి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి, ఉపాధ్యాయులు, సిబ్బంది పనితీరుపై సమీక్ష జరుపాలి. కానీ ఆ పరిస్థితి ఇక్కడా కానరావడం లేదు. పాఠశాలల తనిఖీలను మరిచిన అధికారులు మొద్దునిద్ర పోవడం వల్లే ఈ తరహా ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు తనిఖీ చేసి ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.