ఈ జీవితం హుస్నాబాద్ ప్రజల సేవకే అంకితం

– హుస్నాబాద్ ను అభివృద్ధి చేశా, ఆశీర్వదించండి
– ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్:  ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ ను ఈ తొమ్మిదన్నర ఏళ్లలో గణనీయంగా అభివృద్ధి చేశానని, ఈ జీవితం హుస్నాబాద్ ప్రజల సేవకే అంకితమని హుస్నాబాద్ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ అభ్యర్థి  సతీష్ కుమార్ అన్నారు.హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్  కార్యాలయంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్  వినోద్ కుమార్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ  హుస్నాబాద్ నియోజకవర్గంలో  త్రాగునీరు, సాగునీరు ఇబ్బందులను దూరం చేస్తూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీళ్లు, మిషన్ కాకతీయ ద్వారా 465 చెరువులు మరమ్మతులు చేసుకున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 17 చెక్ డ్యాములు నిర్మించామనీ, దేవాదుల, మిడ్ మానేరు నుండి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తున్నామని అన్నారు. 16 విద్యుత్ సబ్ స్టేషన్ లు, 100 పడకల ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రం, ప్రతి. 5వేల ఎకరాలకు ఒక రైతు వేదిక నిర్మాణం చేసి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సలహాలు ఇప్పిస్తున్నామని అన్నారు. కరోనా సమయంలో విశేష సేవలు అందించామనీ, స్వయంగా నేను కరోనా బారినపడి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాను అంటే  హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే అని అన్నారు. ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి, ఈవీఎం మిషన్ పై నాలుగో నెంబర్ కారు గుర్తు ఉంటుందని ప్రజలందరూ ఆశీర్వదించాలని సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మార్కెట్ చైర్మన్ ఎడబోయిన రజిని, పట్టణ అధ్యక్షుడు అన్వర్, మండలాధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, ఆకుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love