యువత జీవితాల్లో వెలుగులు నింపే జీవనజ్యోతి ఈ వేదిక

This platform is a beacon of light in the lives of the youth– మూడు నెలల్లోనే ఉపాధి కల్పించేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
– స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు శంకుస్థాపన
నవతెలంగాణ- నల్లగొండ కలెక్టరేట్‌
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు యువత జీవితాల్లో వెలుగులు నింపే జీవనజ్యోతి వేదికలని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలో రూ.20 కోట్లతో నిర్మిస్తున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌కు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది ఒక భవనం కాదని ఎందరో నిరుద్యోగ యువతీ, యువకుల జీవితాలు, కుటుంబాల్లో వెలుగులు నింపే జీవనజ్యోతి అని అన్నారు. అందరు నాయకుల్లాగా.. తాను ప్రారంభోత్సవాలు చేసి చేతులు దులుపుకునే రకం కాదని, ప్రారంభించిన ప్రతి పనినీ పూర్తి చేసేవరకు పర్యవేక్షిస్తానని, నిర్మాణం పూర్తయిన తర్వాత స్కిల్‌ సెంటర్లో కోర్సు ముగిసిన రెండు నుంచి మూడు నెలల్లో ఉపాధి దొరికేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఇది తన కలల ప్రాజెక్టు అని, తనను గుండెల్లో పెట్టుకున్న నల్లగొండ యువత రుణం తీర్చుకోవడానికి తనకు దొరికిన అవకాశమని అన్నారు. యువత చెడు వ్యసనాలకు, దురలవాట్లకు లోనుకాకుండా స్కిల్‌సెంటర్‌లో చేరి మీ జీవితాలను తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఉద్యోగాలు రాలేదని డిప్రెషన్‌లోకి వెళ్లకుండా స్కిల్‌సెంటర్లో చేరి బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవాలని ఆయన యువతకు సూచించారు. నల్లగొండ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ హరిచందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, మిర్యాలగూడ ఎమ్యెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, న్యాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ బిక్షపతి, డైరెక్టర్‌ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love