జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్
నవతెలంగాణ – రాయపోల్
నిరంతరం ప్రజల కోసం తమకలాన్ని అక్షరాలుగా మార్చుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ నిజాలను వెలికితీసే జర్నలిస్టుల పై దాడులు చేయడం సిగ్గుచేటని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు,సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు.జర్నలిస్ట్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తూ మన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తు వాస్తవాలను వెలుగులోకి తేస్తే జీర్ణించుకోలేక జర్నలిస్టుల పై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదన్నారు. కొండపాక మండల పరిధిలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో అక్రమ మట్టి దందాలు జరుపుతున్న ఇసుక మాఫియా పై వార్త రాసిన విలేఖరి పై దాడి చేయడాన్ని  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.కులం పేరుతో దూషించి దాడి చేయడం పై మండిపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరి పై పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా దాడి చేయడానికి సిగ్గుచేటన్నారు. “నోట్ల కట్టలవుతున్న మట్టి కుప్పలు” అనే శీర్షికతో అక్రమ మట్టి తరలింపుకు సంబంధించిన వార్తను రాశాడని, కొమురవెల్లి రైల్వే స్టేషన్ కు సంబంధించిన వంతెన నిర్మాణ పనులలో భాగంగా తీస్తున్న మట్టిని అక్రమంగా కొంతమంది రియాల్టర్లు వెంచర్లకు తరలిస్తున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ మట్టి వ్యాపారానికి సంబంధించిన వాస్తవాలను తెలుసుకున్న జర్నలిస్టు యాదగిరి వార్తను ప్రచురించడంతో వారి దందాకు అడ్డంపడుతున్నాడని కారణంతో తిమ్మారెడ్డి పల్లి శివారులో స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్న ముస్త్యాల యాదగిరిని అడ్డుకొని విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారన్నారు. వార్తను కవర్ చేసేందుకు వెళ్లి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన రిపోర్టర్లపైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభమని అలాంటి మీడియా జర్నలిస్టుల పైన దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులు, అక్రమ వ్యాపారులు వాస్తవాలు రాసే జర్నలిస్టులపై అక్కడక్కడ ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుపై దాడికి పాల్పడిని వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
Spread the love