నాడు సస్పెండైన వారే నేడు మంత్రులు !

Those who were suspended are the ministers today!– ఓడినా మంత్రులైన ఇద్దరు మాజీలు
– జేడీయూ రాజ్యసభ సభ్యుడు కూడా…
– తిరిగి లోక్‌సభలో ప్రవేశించిన 58 మంది ఎంపీలు
న్యూఢిల్లీ : గత పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఉభయ సభల నుండి ప్రతిపక్ష పార్టీలకు చెందిన 146 మంది సభ్యులు సస్పెన్షన్‌కుగురయ్యారు. దిగువసభ స్పీకర్‌ ఓం బిర్లా, ఎగువసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌లు అసాధారణ నిర్ణయాలు తీసుకొని వారిని సాగనంపారు. ఆనాడు లోక్‌సభ నుండి సస్పెన్షన్‌కు గురైన 22 మంది ఎంపీలు తాజా ఎన్నికల్లో పోటీ చేయలేదు. డీఎంకేకు చెందిన సభ్యుడు గణేశ మూర్తి చనిపోయారు. 58 మంది సభ్యులు మాత్రం తిరిగి దిగువసభలో ప్రవేశించారు.
17వ లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడంతో ప్రభుత్వం ఆడింది ఆట…పాడింది పాటలా సాగిపోయింది. సభలో గొంతెత్తితే చాలు…వారిని సస్పెండ్‌ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రతిపక్ష సభ్యులెవ్వరూ సభలో లేకుండానే అనేక కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర వేయించుకున్నారు. ఇప్పుడు 18వ లోక్‌సభ కొలువుదీరింది. నాడు స్పీకర్‌ ఓం బిర్లా సస్పెన్షన్‌ వేటు వేసిన ముగ్గురు ప్రతిపక్ష సభ్యులు ఇప్పుడు మోడీ ప్రభుత్వంలో మంత్రులయ్యారు.
వారిద్దరికీ లక్కీ ఛాన్స్‌
లూథియానా నుండి కాంగ్రెస్‌ తరఫున 17వ లోక్‌సభకు ఎన్నికైన రవనీత్‌ సింగ్‌ బిట్టూ ఇప్పుడు మోడీ సర్కారులో మంత్రిగా ఎంపికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ఆయనను మంత్రి గా నియమించారు. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ మనుమడైన బిట్టూ సార్వత్రిక ఎన్నికలకు ముందు గోడ దూకారు. అయితే లూథియానా ఓటర్లు మరోసారి కాంగ్రెస్‌కే ఓటేశారు. అయినప్పటికీ మోడీ ఆయనకు మంత్రి పదవిని కట్టబెట్టారు. కాంగ్రెస్‌కు చెందిన మరో ఎంపీ గీతా కోడా కూడా బీజేపీలో చేరి జార్ఖండ్‌లోని సింఫ్‌ుభుమ్‌ నుండి బరిలో దిగి ఓటమి పాలయ్యారు. అయినా ఆమెను మంత్రి పదవి వరించింది. గత శీతాకాల సమావేశాల్లో సస్పెన్షన్‌కు గురైన అమ్‌ఆద్మీ ఎంపీ సుశీల్‌ కుమార్‌ రింకు బీజేపీ తీర్థం పుచ్చుకొని జలంధర్‌లో పోటీ చేశారు. అయితే లూథియానా, సింఫ్‌ుభుమ్‌లో జరిగిందే జలంధర్‌లోనూ జరిగింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మంచి మెజారిటీతో గెలుపొందారు.
జేడీయూ సభ్యులు ఎక్కువే
సస్పెన్షన్‌ గురైన వారిలో జేడీయూకు చెందిన వారు ఎక్కువగానే ఉన్నారు. శీతాకాల సమావేశాల్లో సస్పెన్షకు గురైన జేడీయూ ఎంపీ లల్లన్‌ సింగ్‌ తాజా ఎన్నికల్లో విజయం సాధించారు. అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌ను గత సమావేశాల్లో సస్పెండ్‌ చేశారు. ఆయన ఇప్పుడు మోడీ క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. గత శీతాకాల సమావేశాల్లో సస్పెండ్‌ అయిన జేడీయూ ఎంపీలు దులాల్‌ చంద్ర గోస్వామి, చంద్రేశ్వర్‌ ప్రసాద్‌ తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ పార్టీకే చెందిన నలుగురు ఎంపీలు ఇప్పుడు బీజేపీ సభ్యులుగా లోక్‌సభలో ప్రవేశించారు. నాడు సస్పెండ్‌ అయిన జేడీయూ రాజ్యసభ సభ్యుడు అంజల్‌ ప్రసాద్‌ హెగ్డే ఇప్పుడు బీజేపీ సభ్యుడు. నాడు సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు జేడీయూ సభ్యులు తాజా ఎన్నికల్లో పోటీ చేయలేదు.
ఆ 52 మంది పున : ప్రవేశం జేడీయూను మినహాయించి గత శీతాకాల సమావేశాల్లో సస్పెన్షకు గురైన 52 మంది సభ్యులు తిరిగి సభలో ప్రవేశించారు. ఏడుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఇప్పటికే పూర్తైనందున మిగిలిన సభ్యులు సభలో కొనసాగుతున్నారు. గత లోక్‌సభలో అనర్హత వేటు పడిన ఇద్దరు ఎంపీలు… రాహుల్‌ గాంధీ, మహువా  మొయిత్రాలు తిరిగి సభలో ప్రవేశించారు. రాహుల్‌ ప్రతిపక్ష నేత అయ్యారు.
ఇకనైనా…
ప్రతిపక్షానికి చెందిన వారు అయినందునే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వారందరినీ శీతాకాల సమావేశాల నుండి సస్పెండ్‌ చేశారు. అయితే వారిలో చాలా మందిని ఓటర్లు తిరిగి ప్రజాస్వామ్య దేవాలయానికి పంపారు. తిరిగి స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లా ఈసారైనా కీలక బిల్లులపై చర్చలో భాగస్వాము లయ్యేందుకు వారికి అవకాశం ఇస్తారా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Spread the love