నవ తెలంగాణ-ఖమ్మంరూరల్
పాలేరు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఓ ఇంట్లో నిల్వ చేసిన రూ.3 కోట్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు, ఐటీ అధికారులు కలిసి సీజ్ చేశారు. నగదు నిల్వ చేసిన వారిపై ఖమ్మం రూరల్ స్టేషన్‌లో సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ ప్రాజెక్టు మేనేజర్ జగ్గవరపు శ్రీకాంత్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇద్దరు కలిసి గత నెల అక్టోబర్‌లో జగ్గవరపు శ్రీకాంత్ రెడ్డి బంధువయిన ఏదులాపురం పంచాయతీ వరంగల్ క్రాస్ రోడ్‌లోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న చండు కరుణ ఇంట్లో రూ.3 కోట్లు పెట్టారు. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి ఉద్దేశించి ఈ నగదు నిల్వ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందుగా ఆ నగదు ఓటర్లకు పంచేందుకు నిర్ణయించారు. ఎన్నికల ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు తమకు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు, ఐటీ అధికారులతో కలిసి చుండు కరుణ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.3 కోట్లు నగదు పట్టుబడింది. పట్టుబడిన నగదును ఐటీ అధికారులు సీజ్ చేశారు. సంఘటనపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి అజరు కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.