– కేంద్రమంత్రి వర్గం ఆమోదం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
16వ ఆర్థిక సంఘానికి సంబంధించి జాయింట్ సెక్రెటరీ స్థాయిలో మూడు పోస్టులకు కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. అందులో జాయింట్ సెక్రెటరీ రెండు పోస్టులు, ఆర్థిక సలహాదారు ఒక పోస్టులు ఉన్నాయి. గురువారం కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 2023 డిసెంబర్ 31 నాటి నోటిఫికేషన్ తో రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటైన కమిషన్‌కు సహాయం చేయడానికి కొత్తగా సృష్టించిన ఈ పోస్టులు అవసరం అని ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్ 31న కమిషన్ చైర్మెన్‌గా అరవింద్ పనగారియాను క్యాబినెట్ నియమించిన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. పనగారియా గతంలో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ)లో చీఫ్ ఎకనామిస్ట్‌గా ఉన్నారు. నిటి ఆయోగ్ మొదటి వైస్ చైర్మెన్‌గా ఉన్నారు. కమిషన్ కార్యదర్శిగా రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే నియమితులయ్యారు. 16వ ఆర్థిక సంఘం కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల భాగస్వామ్యానికి సంబంధించిన సిఫారసులు, పంచాయితీలు, మున్సిపాలిటీల వనరులకు అనుబంధంగా రాష్ట్రాల ఏకీకృత నిధిని పెంచడానికి అవసరమైన చర్యలు, విపత్తు నిర్వహణ కార్యక్రమాల ఫైనాన్సింగ్, మరిన్నింటిని సమీక్షించే పనిలో ఉంది. ఏప్రిల్ 2026 నుంచి 2031 వరకు ఐదేండ్ల కాలానికి సంబంధించిన నివేదికను 2025 అక్టోబర్ 31 నాటికి సమర్పించాలని కోరింది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ సీనియర్ ఎంపీగా ఉన్న ఎన్‌కె సింగ్ అధ్యక్షతన ఉన్న 15వ ఆర్థిక సంఘం, 2021 నుంచి 2026 వరకు విభజించదగిన పన్ను పూల్‌లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫారసు చేసింది.