సాయుధ పోరాట నెత్తుటి తిలకం దొడ్డి కొమరయ్య

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదటి అమరుడు దొడ్డి కొమరయ్య. 1946 జులై 4న కడివెండి గ్రామంలో జరిగిన ఆనాటి దమనకాండ తెలంగాణ ప్రజల జీవితాల్ని మార్చి వేసింది. జాగీర్దారులు, జమీందారుల పెత్తనంతో నలిగి చావడం కంటే ప్రాణాలు బలిదానం చేసైనా తమ జీవితాలను మార్చుకోవాలన్న దృఢ నిశ్చయంతో కదం తొక్కుతూ ముందుకు నడిచారు పోరాటవీరులు. ఎన్ని ప్రాణాలు బలి తీసుకునైనా తామే గెలవాలని అను కున్నారు దేశ్‌ముఖ్‌, వారి గుండాలు. చివరకు గెలుపెవరిదో చరిత్ర చెప్పింది. కాకిగా పుట్టి కలకాలం బతకడం కంటే నెమలిగా పుట్టి కొన్ని ఘడియలు బతికినా చాలనే సామెత ఉంది. రెండూ పక్షులే కానీ వాటికా విలువ ఎందు కొచ్చింది. కాకి తనకోసం మాత్రమే బతుకుతుంది. నెమలి మనకెంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. తనకు జన్మతహా వచ్చిన శరీర భాగాల్ని నృత్యరూపంలో ప్రదర్శిస్తూ ఖ్యాతిని పొందింది. అలాగే అమరుల త్యాగాలు కూడా మానవాళి అభ్యున్నతికి ఆభరణాలు. ఇక్కడ అమరుల గురించి ఒక వాక్యం రాయాలనిపించింది. ప్రజలకోసం పరిమళించిన ఎర్ర మల్లెలు మన అమరవీరులు. భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆనాడు వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రాణాలిచ్చిన 4వేల మంది త్యాగధనులు, వారందించిన కర్తవ్యాన్ని ముందుకు తీసుకు పోయే క్రమంలో ఈనాటివరకు తమ రక్తం ధారబోస్తున్న వీరులు ఎందరో ఆ మల్లెలకు పరిమళాలు నింపుతూనే ఉన్నారు. కొండకోనల్లో నివసించే గిరిజనుల విముక్తి కోసం పోరాడి అసువులు బాసిన బండారు చంద్రరావు, బత్తుల భీష్మారావు, పులిబిడ్డ పులి రామయ్య, శ్యామల వెంకటరెడ్డి, భూస్వాముల గుండెల్లో దడ పుట్టించిన గండ్లూరి కిషన్‌ రావు, గాదె శ్రీనివాసరెడ్డి, నరహరి, పాషా, విద్యుత్తు ఉద్యమ అమరుడు సత్తెనపల్లి రామకృష్ణ.. ఇలా ఎందరో తమ ప్రాణాలు పోతాయని తెలిసికూడా ప్రజల సమస్యల కంటే తమ ప్రాణాలు ఎక్కువ కాదని చురకత్తుల గాయాలను పూలహారాలుగా స్వీకరించారు. శత్రుమూకలే వీరి ధైర్య సాహసాలను చూసి భయపడి వెనక్కితగ్గిన సందర్భాలు లేకపోలేదు.
ఎంత రక్తం ధారబోసినా ప్రజల జీవితాల్లో మౌలిక మార్పు వస్తేనేగాని మన లక్ష్యం నెరవేరదు. పది లక్షల ఎకరాల భూమి పంపకం వల్ల ఎందరో పేద, కౌలు రైతులు దొరల దోపిడీనుండి కొంత విముక్తి పొందారు. వ్యవసాయం మీద వచ్చే ఆదాయంతో తమ బిడ్డల్ని చదివించుకున్నారు. ఆ బిడ్డలే ఇవాళ తెలంగాణలో నూతన మార్పు కోసం గళమెత్తి ప్రభుత్వాల మెడలు వంచుతున్నారు. ఈరోజు జరుగుతున్న అనేక పోరాటాలకు ఎజెండాలకు దారి చూపింది నాటి వీర తెలంగాణ సాయుధ పోరాట అనుభవాలే అనేది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. భీమిరెడ్డి నర్సింహారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం, చిట్యాల ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి వంటి ఎందరో యోధానుయోధుల వీరగాధలే ఈనాటి పోరాటాలకు స్ఫూర్తినిస్తున్నాయి. కానీ వారు కోరుకున్న గ్రామ స్వరాజ్యాన్ని కూలదోస్తున్న శక్తులు నేడు పెరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, అప్పులపాలైన స్థితిలో దుర్భరంగా మారింది. నిరుద్యోగం, ధరల పెరుగుదలతో మధ్యతరగతి బాధలు వర్ణనాతీతం. మనుస్మృతినే రాజ్యాంగంగా పరిగణిస్తూ సాధిం చుకున్న హక్కుల్ని కాలరాస్తున్నారు. స్త్రీలు, సామాజిక తరగతుల జీవితాల్లో వచ్చిన మార్పుని వంద ఏండ్లు వెనక్కి నెడుతున్నారు. బీజేపీ పాలకుల రాక్షసకృత్యాలు పసిగట్టలేని తెలంగాణ ప్రజలు అక్కడక్కడా కొందరిని గెలిపించి కొరివితో తల గోక్కుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే సమస్యలన్నీ తీరుస్తామన్నారు. నేడు రాష్ట్రంలో మాజీ జాగీర్దార్లు, జమీందార్లు కొత్త అవతారం ఎత్తి మంత్రులు, ఎమ్మెల్యేలుగా మారారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాగ్దానాలకు, అమలు చేసినదానికి పొంతన లేదు. ఇండ్లు లేక పేదలు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారు. వారికి ఇవ్వడానికి జానెడు భూమి లేదు గానీ పాలక పార్టీల్లో ఉన్నవారికి వందలవేల ఎకరాలు ఎట్లా వస్తోంది. నిరుద్యోగం యువతను పెడదోవ పట్టించి అశక్తులను చేస్తుంటే, అది పరిష్కరించాల్సింది పోయి తాగుడుకి బానిసల్ని చేసి, శవాలపై కాసులేరుకునే చందంగా మద్యం అమ్మకాలు పెంచడం ఏ అభివృద్ధికి సూచికో ఆలోచించండి. తాగేవారు ఉన్నారు కాబట్టి అమ్ముతున్నామంటున్నారు. పిల్లలు చిన్నప్పుడు తెలియక అశుద్ధం తినబోతే తిననిస్తామా? ప్రపంచ రికార్డులకెక్కే నిర్మాణాలు కట్టేంత ధనమున్న మీకు మద్యం మీద ఆదాయం లేకపోతే ప్రభుత్వం నడవదా. వచ్చిన ఆదాయమంతా మద్యానికి ధారబోస్తే, కుటుంబాలు ఎంత అస్థవ్యస్థమవుతున్నాయో మీ దృష్టికి రాలేదా. ఆడపిల్లలపై హింస పెరగడానికి మద్యం కారణమని ఎన్నో నివేదికలు చెప్పినా ఫలితం శూన్యం. డ్రగ్‌ మాఫియా కూడా స్వైర విహారం చేస్తూ ఇంకా పసిపిల్లల ఉసురు తీస్తున్నది. ఇటువంటి అనేక సమస్యలు పరిష్కారం కాకుండా సాయుధ పోరాట ఫలాలు భావితరాలకు అందవు. ఈ మౌలిక మార్పులకు అవసరమైన ఎజెండాలతో త్యాగపూరితమైన ఉద్యమాలు ఇంకా ఉధృతం చేద్దాము. తొమ్మిది నెలలు మోసినా, ప్రకృతి సహజమే అయినా, భయంకరమైన పురిటి నొప్పులు లేకుండా, రక్తం చిందించకుండా శిశువుకు జన్మనివ్వలేదు తల్లి. నూతన సమాజం అవతరించాలంటే మన వేలాదిమంది అమరవీరులు అందించిన మార్గమే మనకు అనుసరణీయం. జోహార్‌ దొడ్డి కొమరయ్య. జోహార్‌ అమరవీరులకు. (నేడు దొడ్డి కొమరయ్య వర్థంతి)
– బి. హైమావతి, 9391360886

 

Spread the love