బంధం దృఢ‌మ‌వ్వా‌లంటే..?

To strengthen the bond..?పెండ్లి తర్వాత తమ సంసారం హాయిగా సాగిపోవాలని భార్యాభర్తలు కోరుకోవడం సహజం. జీవితం హాయిగా గడవాలన్నా, ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఈ రోజుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరి. అయితే ఈ హడావిడిలో పడి చాలా జంటలు ఒకరికొకరు తగిన సమయం కేటాయించుకోలేక పోతున్నారు. ఇక పని వేళలు, సెలవు రోజులు వేర్వేరుగా ఉండే వారు ఇంట్లో ఉన్నా హారు, బైలతో సరిపెట్టుకోవాల్సిందే. నిజానికి ఈ ఉరుకుల పరుగుల జీవితం ఆరోగ్యాన్నే కాదు అనుబంధాన్నీ దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. సంసారంలో కలతలు రావడానికి ఇదీ ఓ కారణమంటూ చాలా మంది ఆవేదన చెందుతున్నారు. ఏదేమైనా పని వేళలు, సెలవు రోజుల్లో తేడాల వల్ల అనుబంధానికి ముప్పు వాటిల్లకూడదంటే భార్యాభర్తలు తమకు దొరికిన ఆ కాస్త సమయాన్నే తెలివిగా సద్వినియోగం చేసుకోవడం మంచిదం టున్నారు. మరి అదెలాగో తెలుసుకుందాం…
భార్యాభర్తలిద్దరికీ షిప్టు సమయాలు వేరైనప్పటికీ రోజులో ఏదో ఒక సమయం ఇద్దరికీ అనువుగా రావచ్చు. ఓరోజు మధ్యాహ్నం లంచ్‌ సమయానికి ఇద్దరూ ఇంట్లోనే ఉండచ్చు. లేదంటే రాత్రిళ్లు కలిసి భోజనం చేసే అవకాశం దొరకచ్చు. మరో రోజు ఉదయాన్నే కలిసి వ్యాయామం చేయడానికి వీలు కుదరచ్చు. ఇంకో రోజు కలిసి ఇంటి పనులు, వంట పని చేసుకునేందుకు సమయం కలిసి రావచ్చు.
సరదాగా మాట్లాడుకోవచ్చు
సెలవు రోజుల్లో కొంతమంది మొబైల్స్‌, టీవీలకు అతుక్కుపోవడం, ఇంకొంత మంది దొరక్క దొరక్క ఖాళీ సమయం దొరికిందని తమకు నచ్చిన పనుల్లో లీనమవడం వంటివి చేస్తుంటారు. కానీ ఇలాంటి పనులతో సమయాన్ని వృథా చేసుకోకుండా భాగస్వామితో గడపడానికి కేటాయిస్తే ఇద్దరూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకోవచ్చు. దీని వల్ల ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌ దెబ్బతినకుండా జాగ్రత్తపడవచ్చు. అలాగే పని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక వీక్లీ ఆఫ్‌లు కుదరకపోయినా నెలకోసారో లేదా రెండుసార్లో ఒకరి వీక్లీ ఆఫ్‌ రోజున మరొకరు సెలవు పెట్టుకోవడం, ఇదే విధంగా మరోసారి ఇంకొకరు సెలవుల్ని ఎడ్జస్ట్‌ చేసుకోవడం వల్ల మరింత ఎక్కువ సమయం కలిసి గడిపేందుకు వీలు దొరుకుతుంది.
భావాలు పంచుకోండి
కాపురమన్నాక కలతలు, గొడవలు సహజం. వీటికి తోడు కెరీర్‌ పరంగా ఇద్దరూ బిజీగా ఉండడం వల్ల కలిసి గడపలేకపోతున్నామన్న ఒత్తిడి ఇద్దరిలోనూ సహజం. ఇవి మానసికంగా కుంగదీస్తాయి. ఈ చిరాకుతోనూ భార్యాభర్తలిద్దరి మధ్యా గొడవలు రావచ్చు. అయితే పని వేళల్లో తేడాల వల్ల అసలే సమయం దొరకట్లేదని ఈ గొడవల్ని నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇద్దరికీ ఉమ్మడిగా దొరికిన ఆ కాస్త సమయంలోనే ఓ పావుగంటో, అరగంటో కేటాయించి ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడం మేలంటున్నారు నిపుణులు. అలాగే ఒకరి కష్టసుఖాల్ని మరొకరు పంచుకోవడం, ఒకరికొకరు అండగా నిలవడం కూడా బిజీ లైఫ్‌స్టైల్లోనూ అనుబంధాన్ని పెంచుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గమే అంటున్నారు.
సహాయం చేసుకోవడం
ఇద్దరూ ఉద్యోగాలు చేసే భార్యాభర్తలు బాధ్యతల్నే కాదు ఇంటి పనుల్నీ సమానంగా పంచుకోవడం మనం చూస్తుంటాం. ఇద్దరూ కలిసి ఆయా పనులు చేసుకోవడం వల్ల ఇంటి పని త్వరగా పూర్తవుతుంది. ఒక్కరిపైనే భారం పడకుండానూ ఉంటుంది. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరుగుతుంది. అయితే షిప్టు వేళలు వేరైనా కలిసి గడిపే సమయం దొరక్క పోయినా ఇంటి పనుల్ని సమానంగా పంచుకుంటూ ముందుకు సాగితే భార్యాభర్తలు తమ అనుబంధాన్ని దృఢం చేసుకోవచ్చం టున్నారు నిపుణులు. అదెలాగంటే ఒకరు చేయగా మిగిలిన పనుల్ని మరొకరు చేసుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. పరోక్షంగా ఒకరికొకరు సహాయపడినట్లూ ఉంటుంది. ఇది కూడా ఆలుమగల మధ్య అనుబంధాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు.

దీన్లో నిర్లక్ష్యం వద్దు
దాంపత్య జీవితంలో శృంగానిది కీలక పాత్ర. అయితే చాలా మంది భార్యాభర్తలు తీరిక లేని పని వేళలు, షిప్టుల్లో మార్పుల కారణంగా దీనికి సమయం కేటాయించలేకపోతున్నారు. మరికొందరు పని ఒత్తిళ్లతో సతమతమవుతూ లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. ఫలితంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. పరిస్థితి ఇక్కడి దాకా రాకూడదంటే ముందే జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. ఇద్దరికీ దొరికిన సమయాన్నే ఇందుకు సద్వినియోగం చేసుకోవాలంటున్నారు. ఇందులో భాగంగా ఇద్దరూ పరస్పరం ఒకరి కోరికల్ని మరొకరు తెలుసుకొని మసలుకోవడం, అప్పుడప్పుడూ వెకేషన్స్‌కి ప్లాన్‌ చేసుకోవడం వంటివి చేయాలి. ఇవన్నీ మానసికంగా, శారీరకంగా ఇద్దరినీ దగ్గర చేసే మార్గాలు. కాబట్టి కెరీర్‌ విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ లైంగిక జీవితాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయడం తగదంటున్నారు నిపుణులు.

Spread the love