– ఇంగ్లాండ్‌పై 7 వికెట్లతో ఘన విజయం
– ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025
కరాచి (పాకిస్థాన్): ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో మాజీ చాంపియన్ దక్షిణాఫ్రికా టాప్ లేపింది. శనివారం కరాచిలో జరిగిన గ్రూప్ దశ ఆఖరు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 180 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 29.1 ఓవర్లలోనే ఛేదించింది. వాన్‌డర్ డసెన్ (72 నాటౌట్, 87 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), హెన్రిచ్ క్లాసెన్ (64, 56 బంతుల్లో 11 ఫోర్లు) అర్థ సెంచరీలతో దంచికొట్టారు. రియాన్ రికెల్టన్ (27) రాణించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (0) నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 38.2 ఓవర్లలోనే 179 పరుగులకు కుప్పకూలింది. సఫారీ పేసర్లు మార్కో జాన్సెన్ (3/39), ముల్డర్ (3/25) రాణించారు. ఇంగ్లాండ్ తరఫున జో రూట్ (37), బెన్ డకెట్ (24), జోశ్ బట్లర్ (21) 20 ప్లస్ పరుగులు చేశారు. సాల్ట్ (8), స్మిత్ (0), హ్యారీ బ్రూక్ (19), లివింగ్‌స్టోన్ (9) తేలిపోయారు. మార్కో జాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. గ్రూప్ దశలో మూడు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ అత్యంత చెత్త ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది.