– విద్యుద్ఘాతంతో ఇద్దరు మృతి
– బాధిత కుటుంబాలకు మంత్రి సీతక్క పరామర్శ
– ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన
నవతెలంగాణ-ములుగు
గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో విద్యుద్ఘాతంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన బొడ అంకిత్ కుమార్, ల్యాడ విజరు, బోడ కళ్యాణ్ చక్రి జాతీయ జెండాను అమర్చుతుండగా.. కరెంట్ తీగలకు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యారు. బొడ అంకిత్ కుమార్, ల్యాడ విజరు మృతిచెందారు. గాయపడిన కళ్యాణ్ చక్రిని ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తక్షణ సహాయం 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. వేడుకలు జరిగేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ ఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. గాయపడిన కళ్యాణి చక్రికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.