– టీఎస్‌యూటీఎఫ్ గురుకులం రాష్ట్ర కమిటీ డిమాండ్
– నూతన కమిటీ ఎన్నిక
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గిరిజన గురుకుల సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్ గురుకులం రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. టీఎస్‌యూటీఎఫ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (గురుకులం) ఉపాధ్యాయుల విభాగం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో హరీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, కోశాధికారి టి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ రాష్ట్రంలో 160 గురుకులాలు, 23 ఏకలవ్య ఆదర్శ గురుకులాలను గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ విద్యాసంస్థల్లో 2018, 2019లో నియామకమైన ఉపాధ్యాయులకు ఆరేండ్లైనా రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు విడుదల చేయలేదని చెప్పారు. దీంతోపాటు బదిలీలు, పదోన్నతులు నిర్వహించకపోవటం శోచనీయమన్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని కోరారు. శ్రమకు తగిన వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 317 జీవో, పీఆర్సీలో కరస్పాండింగ్ స్కేలు వర్తింపు, 2008లో రెగ్యలరైజ్ అయిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపు వంటి అంశాలపై హైకోర్టు తీర్పులను తక్షణమే అమలు చేయాలని కోరారు.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సురేందర్, హరీందర్‌రెడ్డి
సమావేశానంతరం టీఎస్‌యూటీఎఫ్‌నకు అనుబంధంగా గురుకులం ఉపాధ్యాయుల విభాగం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా డాక్టర్ బి సురేందర్, ప్రధాన కార్యదర్శిగా వి హరీందర్‌రెడ్డి, కోశాధికారిగా ఎస్ రవి కుమార్, మరో 15 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో నాయకులు ఎ గణేష్, బి ఈశ్వర్, ఎస్ ఉపేందర్, డి వెంకన్న, ఎం పావని, కె నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.